M S Raju
“Mahesh, Prabhas Loved Agadha” – MS Raju
“ఈసారి కొడుతున్నారు సార్ అన్నారు మహేష్.. కొడుతున్నావ్ బావ అన్నారు ప్రభాస్” – ఎం.ఎస్. రాజు
దర్శకుడు, నిర్మాత ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన తాజా చిత్రం ‘అగధ’. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భానుచందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మిస్టిక్ డివైన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘అగధ’ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎం.ఎస్. రాజు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన సినిమా విశేషాలతో పాటు తన సినీ ప్రయాణం, హీరోలతో ఉన్న అనుబంధం, వీఎఫ్ఎక్స్, ‘అగధ’ సీక్వెల్ తదితర అంశాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
‘అగధ’ అంటే ఏంటి?
‘అగధ’ టైటిల్ పెట్టగానే చాలామంది దాని అర్థం తెలుసుకోవడానికి నెట్లో సెర్చ్ చేశారు. ‘అగధ’ అంటే లోతైన అంశం, ఒక శూన్యం అని చెప్పుకోవచ్చు. మనం దేవుడిని, దెయ్యాలను కంటితో చూడలేదు. అలాంటి ఫోర్స్‌ల మధ్య జరిగే కథే ‘అగధ’.
ప్రస్తుతం సినిమాకు ఓపెనింగ్స్ తీసుకొచ్చేది యూత్, మాస్ ఆడియెన్స్. ఆ తర్వాత మౌత్ టాక్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా థియేటర్లకు వస్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నా గురించి ఒక మంచి మాట చెప్పారు. నాకు తెలిసిన ఎం.ఎస్. రాజు కేవలం హారర్ ఎలిమెంట్స్‌తో మాత్రమే సినిమా చేయడు.. ఇందులో చాలా అంశాలు ఉంటాయని ఆయన అన్నారు. ఆయన నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నారో ఆ మాటలే నిదర్శనం.
ఆయన చెప్పినట్టుగానే ‘అగధ’లో కేవలం హారర్, భయపెట్టే అంశాలు మాత్రమే ఉండవు. అన్ని రకాల అంశాలు ఉంటాయి. దేవుడికి వ్యతిరేకంగా పనిచేసే ఒక దుష్ట శక్తిని ‘అగధ’లో చూపించాను.
‘అగధ’ కోసం ఎలాంటి రీసెర్చ్ చేశారు?
‘అగధ’ కోసం చాలా రీసెర్చ్ చేశాను. చాలా ప్రాంతాల్లో తిరిగాను. అయితే ఆ వివరాలన్నీ ప్రేక్షకులకు అవసరం లేదు. ఇదొక ఆర్ట్ ఫిల్మ్‌లా కాకుండా అందరినీ అలరించేలా తెరకెక్కించాను. నేను చూసిన రియాలిటీకి నా ఫాంటసీని జోడించి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని ప్రయత్నించాను.
‘దేవి’ సినిమా సమయంలో నేను ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాను. అయినప్పటికీ ఏదో ఒక పవర్ నన్ను ముందుకు నడిపించింది. ఇప్పుడు ‘అగధ’ జర్నీలో కూడా అలాంటి ఒక ఫోర్స్ నన్ను ముందుకు నడిపించినట్టుగా అనిపించింది.
ప్రస్తుత తరాన్ని ఆకట్టుకునేలా దుష్టశక్తి నేపథ్యంలో ఒక సినిమా చేయాలని అనుకున్నాను. అందుకే ‘అగధ’ను తెరకెక్కించాను. కేవలం సింగిల్ స్క్రీన్ ఆడియెన్స్ మాత్రమే కాకుండా మల్టీప్లెక్స్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవాలని మొదటి నుంచి అనుకున్నాను. ఈ సినిమాను ఎంతో నిజాయితీతో తెరకెక్కించాను.
సడెన్‌గా సినిమాల నిర్మాణాన్ని ఎందుకు ఆపేశారు?
‘ఆట’, ‘మస్కా’ మంచి సినిమాలు. అవి కమర్షియల్‌గా కూడా మంచి విజయాలు సాధించాయి. అయితే అవి నా స్టాండర్డ్‌లో లేవని చాలా మంది అన్నారు. ఆ తర్వాత మా అబ్బాయి కెరీర్‌పై కూడా దృష్టి పెట్టాను.
చాలా ఏళ్ల తర్వాత ‘డర్టీ హరి’ చేశాను. అది నా టేస్ట్‌కు పూర్తిగా భిన్నమైన సినిమా. నా జర్నీలో ఎప్పుడూ కొత్త కథలకు ఓకే చెబుతూ వచ్చాను. ఎం.ఎస్. రాజు ఎలాంటి జానర్లో అయినా సినిమా తీయగలడు అనే పేరు సంపాదించుకోవాలనేది నా కోరిక.
నాకు నచ్చిన ఆర్ట్ ఫిల్మ్ తీయడం కంటే మంచి కమర్షియల్ సినిమాను తెరకెక్కించడానికే నేను ఎక్కువగా ఇష్టపడతాను.

‘అగధ’ విజయంపై ఎంత నమ్మకంగా ఉన్నారు?
నేను ఇప్పటివరకు ఏ సినిమా విషయంలోనూ స్టేజ్ మీదకు వచ్చి సినిమా బాగుందని అంత ఓపెన్‌గా చెప్పలేదు. కానీ ‘అగధ’ చూసిన తర్వాత ఈ సినిమా బాగుందని, విజయం సాధిస్తుందని నా మనసుకు అనిపించింది. అందుకే ఆ విషయాన్ని ఓపెన్‌గా చెప్పాను.
సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా ఇదే మాట చెబుతారని నాకు నమ్మకం ఉంది.
‘అగధ’లో వీఎఫ్ఎక్స్ ఎలా ఉంటుంది?
నేను ప్రతి ఫ్రేమ్‌పై చాలా ఫోకస్ పెడతాను. నాకు పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాతే ముందుకు వెళ్తాను. నేను తీసే ప్రతి సినిమాలో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ప్రతి క్రాఫ్ట్ గురించి ఆలోచిస్తాను.
నేను నిర్మాతగా ఉన్నప్పుడు కూడా దర్శకులతో కథ, ఇతర అంశాల గురించి చర్చించేవాడిని. వారు కూడా నా సలహాలను తీసుకునేవారు.
ఇప్పటివరకు మీరు చూసిన టీజర్, ట్రైలర్లను బట్టి మా సినిమాలోని వీఎఫ్ఎక్స్ వర్క్ స్టాండర్డ్ ఏంటో అర్థమై ఉంటుంది. సినిమాలో దానికి మించి వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది.
ఎన్టీఆర్‌పై మీరు చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి. మీ వివరణ ఏంటి?
నేను ఇప్పటివరకు ఏ సినిమా కోసం కూడా బ్రహ్మముహూర్తంలో లేచి పని చేయలేదు. కానీ ‘అగధ’ కోసం ఉదయం మూడు గంటలకే నిద్రలేచి పని చేసేవాడిని. ఎన్టీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని పనిచేశాను అని చెప్పే సందర్భంలో అందరికీ తెలిసిన ఒక విషయాన్ని సరదాగా చెప్పాను.
ఆయన ఉదయాన్నే చికెన్ తింటారనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ గారిపై ఉన్న అంతులేని అభిమానంతోనే ఆ మాటలను సరదాగా అన్నాను. దానిని మరో విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు.
మా నాన్నగారికి ఎన్టీఆర్ గారితో మంచి అనుబంధం ఉండేది. మా నాన్నగారికి ఎన్టీఆర్ గారితో సినిమా చేసే అవకాశం కూడా వచ్చింది. అయితే చివరి నిమిషంలో ఎన్నికల కారణంగా ఆ సినిమా మిస్ అయింది. ఎన్టీఆర్ గారి నిబద్ధత, క్రమశిక్షణను నేను దగ్గర నుంచి చూశాను.

‘అగధ’ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగింది?
మొదట ‘అగధ’ను ఎవరికీ ఇవ్వకూడదని అనుకున్నాం. అయితే ట్రైలర్ విడుదలైన తర్వాత చాలామంది ఫోన్ చేశారు. కన్నడ నుంచి హోంబలే టీమ్ కూడా మమ్మల్ని సంప్రదించింది.
గీతా ఆర్ట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కూడా కొంతమంది వచ్చి సినిమాను చూశారు. ముందుగా ఇక్కడ సినిమాను విడుదల చేసి, ఆ తర్వాత మిగతా భాషల్లో విడుదల చేయాలని అనుకుంటున్నాం.
అన్ని భాషల్లో డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. సినిమా విడుదలైన 60 రోజుల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలని నేను చెప్పాను. ఆ డీల్ ప్రస్తుతం హోల్డ్‌లో ఉంది.
మీ హీరోలతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది?
నేను నా ఆర్టిస్టులందరితోనూ మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తాను. ‘అగధ’ టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత మహేష్ బాబు గారు నాకు వాయిస్ మెసేజ్ చేశారు. ‘ఈసారి కొడుతున్నారు సార్’ అని మహేష్ అన్నారు.
అలాగే ప్రభాస్ ‘కొడుతున్నావ్ బావ’ అని అన్నారు. ఆ మాటలు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి.
త్రివిక్రమ్ షూటింగ్లో ఉండగానే వెంకటేష్ గారిని కలిశాను. ఆయన ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. నా హీరోల అభిమానులు కూడా ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు.
ఇకపై దర్శకుడిగానే కొనసాగుతారా?
ప్రస్తుతం కథ, స్క్రీన్‌ప్లే, రైటింగ్, మేకింగ్‌పై దృష్టి పెట్టాను. ఆర్థిక విషయాల జోలికి వెళ్లడం లేదు.
‘డర్టీ హరి’, ‘అగధ’ సినిమాల విషయంలో నా ఫ్రెండ్స్ ముందుకు వచ్చి ‘మేమే నిర్మిస్తాం’ అని అన్నారు. దీంతో ఆర్థిక భారాన్ని తగ్గించుకుని కథ, రైటింగ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టగలిగాను.
‘అగధ 2’ కథ సిద్ధంగా ఉందా?
‘అగధ’ విడుదలైన తర్వాత ప్రీక్వెలా? సీక్వెలా? అన్నది చెబుతాను. ఈ సినిమాకు అలాంటి స్కోప్ అయితే ఉంది.
ప్రస్తుతం మాత్రం ‘అగధ’ ఒక మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ అని మాత్రమే చెప్పగలను. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను రూపొందించాం. ప్రేక్షకులకు ఒక కొత్త తరహా సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలన్నదే మా ప్రయత్నం.
