Mahima Nambiar
‘కామ్రేడ్ కళ్యాణ్’తో తెలుగులో డెబ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది: హీరోయిన్ మహిమా నంబియార్
‘కామ్రేడ్ కళ్యాణ్’ శ్రీవిష్ణు గారి సిగ్నేచర్ స్టైల్లో ఉండే ఫన్ ఎంటర్టైనర్ – మహిమా నంబియార్
‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ శ్రీ విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. పీరియడ్ ఎలిమెంట్స్, హ్యూమర్, రొమాన్స్, ఎమోషన్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలకు మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మహిమా నంబియార్ మీడియాతో ముచ్చటించారు. సినిమా విశేషాలతో పాటు తన పాత్ర, శ్రీ విష్ణుతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, తెలుగు ఇండస్ట్రీలో తన ప్రయాణం తదితర విషయాలను ఆమె పంచుకున్నారు.

ఇది మీ తొలి తెలుగు సినిమా. తెలుగులో నటించడం ఎలా అనిపించింది?
తెలుగులో నటించడం నాకు చాలా కొత్త అనుభవం. అయితే నేను ఏ భాషనైనా త్వరగా నేర్చుకోగలను. తెలుగు నాకు కొంతవరకు అర్థమవుతుంది. షూటింగ్ సమయంలో ప్రతి డైలాగ్‌కి అర్థం తెలుసుకోవడానికి దర్శకుడిని అడుగుతుంటాను. ప్రతి లైన్‌ను అర్థం చేసుకుని నటించడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం చాలా హ్యాపీగా ఉంది.
శ్రీ విష్ణుతో కలిసి నటించడం ఎలా అనిపించింది?
శ్రీ విష్ణు గారు చాలా స్పాంటేనియస్ యాక్టర్. షూటింగ్ స్పాట్లో సీన్స్‌ను చాలా ఇంప్రొవైజ్ చేస్తుంటారు. అది ఒక నటిగా నాకు మరింత ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఆయన స్పాంటేనియిటీకి తగ్గట్టుగా మనం కూడా రియాక్ట్ అవ్వాలి.
అయితే ఆయన మాట్లాడే తెలుగును అర్థం చేసుకోవడం మాత్రం నాకు కొంచెం కష్టం (నవ్వుతూ). ఆయనకు ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంది. అంత స్పాంటేనియస్ యాక్టర్‌తో కలిసి నటించడం నిజంగా మంచి ఎక్స్పీరియన్స్.
శ్రీ విష్ణు గారి సినిమాల్లో నాకు ‘బ్రోచేవారెవరురా’ చాలా ఇష్టం. అలాగే ‘స్వాగ్’ సినిమా కూడా చూశాను.

‘కామ్రేడ్ కళ్యాణ్’లో నటించే అవకాశం ఎలా వచ్చింది?
దర్శకుడు జనకిరామ్ గారు నేను చేసిన తమిళ్, మలయాళ సినిమాలు చూసి నన్ను సంప్రదించారు. కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. శ్రీ విష్ణు గారి సిగ్నేచర్ స్టైల్లో ఉండే మంచి ఫన్ ఎంటర్టైనర్ ఇది.
నిజానికి ఇంతకుముందు శ్రీ విష్ణు గారితో కలిసి ‘సామజవరగమన’ సినిమా చేయాల్సి వచ్చింది. ఆ సినిమా కోసం ఫొటోషూట్ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌లో నేను భాగం కాలేకపోయాను. ఇప్పుడు ‘కామ్రేడ్ కళ్యాణ్’తో శ్రీ విష్ణు గారితో కలిసి నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాతో తెలుగులో డెబ్యూ చేయడం లక్కీగా ఫీల్ అవుతున్నాను.
సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
ఇందులో నాది చాలా ఫన్ క్యారెక్టర్. నా పాత్ర పేరు సితార దేవి. పక్కింటి అమ్మాయిలా కనిపించే చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. ఒడిశా నుంచి వచ్చిన అమ్మాయిగా కనిపిస్తాను.
ఆమె మాట్లాడే భాష కారణంగా హీరో, హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉంటాయి. ఆ కామెడీ సినిమాలో మంచి ఎంటర్టైనింగ్ ఎలిమెంట్‌గా ఉంటుంది. ఒడిశాలో షూటింగ్ చేయడం కూడా నాకు కొత్త అనుభవం.
ఇప్పటికే ‘ఒడియా పిల్లా’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు పాటను ఇష్టపడటం చాలా సంతోషంగా ఉంది.

ఇప్పటివరకు మీరు చేసిన పాత్రలన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయి. అలాంటి పాత్రలనే ఎంచుకుంటున్నారా?
అవును. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ ఒకదానికొకటి డిఫరెంట్‌గా ఉంటాయి. ప్రతి భాషలో కొత్త కొత్త పాత్రలు చేయాలన్నదే నా ఉద్దేశం. నేను చేసిన ప్రతి సినిమా, ప్రతి పాత్ర నాకు ప్రత్యేకమే. ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా, కొత్తగా ప్రయత్నించాలనుకుంటున్నాను.
‘కామ్రేడ్ కళ్యాణ్’ కథను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి?
ఈ కథ చాలా ఫన్‌గా ఉంటుంది. ముఖ్యంగా 90ల బ్యాక్‌డ్రాప్ నాకు చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఇది మంచి కమర్షియల్ ప్యాకేజ్ సినిమా. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి.
సినిమాలో నక్సలిజం బ్యాక్‌డ్రాప్ కూడా ఉంటుంది. అయితే దాన్ని చాలా భిన్నంగా, కామికల్‌గా డీల్ చేశారు. అందుకే కథ నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది.
నిర్మాతల గురించి చెప్పండి?
వాళ్లు చాలా ప్యాషన్ ఉన్న నిర్మాతలు. చాలా మంచి వ్యక్తులు. సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. సినిమా విషయంలో వారి ప్యాషన్ స్పష్టంగా కనిపిస్తుంది.
తెలుగు ప్రేక్షకుల గురించి మీ అభిప్రాయం?
తెలుగు ప్రేక్షకులు సినిమాలను చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. నేను సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చినప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రేమ, ఆదరణ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.
మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు భాషలకు అతీతంగా సినిమాలను ఆదరిస్తారు. అందుకే ‘కామ్రేడ్ కళ్యాణ్’ను కూడా ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.

భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?
ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. నాకు న్యాయం చేయగలనని అనిపించే ప్రతి పాత్రను చేయాలనుకుంటున్నాను. ఒకే జానర్‌కు పరిమితం కాకుండా విభిన్నమైన క్యారెక్టర్స్‌లో కనిపించాలని ఉంది.
ప్రస్తుతం మీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి?
ప్రస్తుతం మలయాళంలో ఒక సినిమా, తమిళంలో మరో సినిమా చేస్తున్నాను. తెలుగులో కూడా కొన్ని మంచి కథలు వింటున్నాను. మంచి కథ, మంచి పాత్ర వస్తే తప్పకుండా తెలుగు సినిమాలు చేయాలనుకుంటున్నాను.
