“No One Can Guess the Climax of Tattvam”: Hero Dinesh Tej
‘తత్వం’ క్లైమాక్స్‌ను ఎవరూ ఊహించలేరు: హీరో దినేష్ తేజ్
విభిన్నమైన కథ, ఆసక్తికరమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా ‘తత్వం’
దినేష్ తేజ్, దశ్విక కె ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘తత్వం’. అర్జున్ కోలా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శీమకుర్తి వంశీకృష్ణ, శ్వేత పసుపులేటి సంయుక్తంగా ట్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్కే ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు.
సస్పెన్స్, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే, వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా ‘తత్వం’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం రేపు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా హీరో దినేష్ తేజ్ బుధవారం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘తత్వం’ కథ, తన పాత్ర, సినిమా ప్రయాణం, ఎదురైన సవాళ్లు, భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఆయన పలు విషయాలను పంచుకున్నారు.
‘తత్వం’ సినిమా చేయడానికి మిమ్మల్ని ఆకట్టుకున్న అంశం ఏమిటి?
ఈ సినిమాలోని ట్విస్టులను ప్రేక్షకులు అంత సులభంగా ఊహించలేరు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్, కథలోని ప్రధాన అంశం నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఒక వ్యక్తి తన గురించి తాను ఏం తెలుసుకుంటాడు? చివరికి ‘తత్వం’ గురించి అతను ఏం అర్థం చేసుకుంటాడు? అనే అంశాలు చాలా ఆసక్తికరంగా అనిపించాయి.
మొత్తంగా చూస్తే చాలా కొత్తగా, విభిన్నంగా అనిపించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఇది. నేను కథ విన్నప్పుడు ఎంత ఫ్రెష్‌గా ఫీల్ అయ్యానో, ప్రేక్షకులు కూడా థియేటర్లో సినిమా చూసినప్పుడు అదే అనుభూతిని పొందుతారని నమ్ముతున్నాను.
‘తత్వం’ ఎలాంటి కథ?
మూఢనమ్మకానికి, నమ్మకానికి మధ్య చాలా సన్నని గీత ఉంటుంది. ఆ గీత చుట్టూనే ‘తత్వం’ కథ సాగుతుంది. ఈ సినిమా కథ 2000 సంవత్సరంలో జరుగుతుంది.
కథలో చాలా లేయర్స్ ఉంటాయి. ఒక్కో అంశం మరో అంశంతో కనెక్ట్ అవుతూ ముందుకు వెళ్తుంది. ఈ విధానం నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది.

ఈ సినిమా సమయంలో మీరు ప్రమాదానికి గురయ్యారని తెలిసింది. దాని గురించి చెప్పండి?
సినిమాకు సంబంధించిన కొన్ని నెగెటివ్ అనుభవాలు కూడా ఎదురయ్యాయి. ప్రమోషన్స్ సమయంలో హీరోయిన్, నేను ఇద్దరం ప్రమాదాలకు గురయ్యాం. అయితే ఆ అనుభవాల వల్ల సినిమా చుట్టూ ఉన్న ‘నెగెటివ్ ఎనర్జీ’ లేదా దిష్టి తొలగిపోయిందేమో అని మేమంతా అనుకున్నాం.
నా విషయంలో ఆ ప్రమాదం చాలా సీరియస్‌గా అనిపించింది. నాకు నిజంగా రెండో జీవితం వచ్చినట్టుగా భావించాను.
అయితే సినిమా మీద నాకు మొదటి రోజు కథ విన్నప్పుడు ఉన్న నమ్మకం ఇప్పుడు మరింత పెరిగింది. ‘తత్వం’ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది.
చాలామంది నన్ను ‘నీ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది? నీ టైమ్ ఎప్పుడు వస్తుంది?’ అని అడుగుతుంటారు. ఆ రోజు ‘తత్వం’తో తప్పకుండా వస్తుందని నమ్ముతున్నాను. నేను మాత్రం నా పని నిజాయితీగా చేసుకుంటూ మంచి సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తాను.
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్స్‌తో వచ్చే సినిమాలను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ‘తత్వం’కు కూడా అదే తరహా ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాకు కథే మా బలం. ప్రేక్షకులే మా అతిపెద్ద బలం.
ఇలాంటి విభిన్నమైన సినిమాలు విజయం సాధించినప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికీ మరింత కాన్ఫిడెన్స్ వస్తుంది. ‘తత్వం’ క్లైమాక్స్ ప్రేక్షకుల హృదయాలను తప్పకుండా టచ్ చేస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను.
మీరు ఎదురుచూస్తున్న కమర్షియల్ సక్సెస్ ఈ సినిమాతో వస్తుందని భావిస్తున్నారా?
నేను కేవలం కమర్షియల్ సక్సెస్ గురించి మాత్రమే ఆలోచించడం లేదు. కొన్ని సినిమాలు ఒక కథ చెప్పాల్సిన అవసరం ఉందనే నమ్మకంతో చేస్తాం.
‘తత్వం’లో ఉన్న కొత్త కాన్సెప్ట్ నన్ను ఆకట్టుకోవడంతో ఈ సినిమా చేశాను. ఒక నటుడిగా ఈ సినిమా నాకు పూర్తి సంతృప్తిని ఇచ్చింది.
కొత్తగా, విభిన్నమైన కథలతో సినిమాలు చేసినప్పుడు ప్రేక్షకుల నుంచి గౌరవం కూడా లభిస్తుంది. నాకు ఆ గౌరవం చాలా ముఖ్యం.
సినిమాలో మీ పాత్ర విషయంలో ఎంత సంతృప్తిగా ఉన్నారు?
నేను ఏ పాత్రను తీసుకున్నా దానికి పూర్తి కమిట్మెంట్తో పనిచేస్తాను. ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తాను.
‘తత్వం’ విషయంలో కూడా నా వంతుగా పూర్తిస్థాయిలో కష్టపడ్డాను. సినిమాలో నా పాత్రను తీర్చిదిద్దిన విధానం పట్ల వ్యక్తిగతంగా చాలా సంతృప్తిగా ఉన్నాను.
వెబ్ సిరీస్‌లు చేయడం లేదా?
నాకు ఓటీటీ వెబ్ సిరీస్‌ల నుంచి కొన్ని ఆఫర్స్ వచ్చాయి. అయితే నేను ఆశించిన స్థాయిలో సంతృప్తినిచ్చే కథలు ఇప్పటివరకు ఎదురుకాలేదు.
కేవలం ఓటీటీ అవకాశం వచ్చింది కదా అని సినిమా లేదా వెబ్ సిరీస్ చేయాలని అనుకోవడం లేదు. కథ, పాత్ర రెండూ నన్ను ఎగ్జైట్ చేయాలి. నాకు నచ్చిన కథ దొరకకపోవడంతో ఆ ప్రాజెక్టులను చేయలేదు.

మీ తదుపరి ప్రాజెక్టులు ఏమిటి?
ప్రస్తుతం ‘హుషారు 2’లో నటిస్తున్నాను. అలాగే విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఒక యాక్షన్ డ్రామాను పూర్తి చేశాను.
దర్శకుడు సతీష్ వేగేశ్నతో ‘కథ కేళి’ అనే ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ సినిమాలన్నీ నటుడిగా నాకు మంచి అవకాశాలను ఇస్తాయని భావిస్తున్నాను.
‘తత్వం’ తర్వాత ఎలాంటి గుర్తింపు రావాలని కోరుకుంటున్నారు?
కొత్తగా, ఆసక్తికరమైన కథలతో వచ్చే రచయితలకు నేను ఒక మంచి ఆప్షన్‌గా మారాలని కోరుకుంటున్నాను. ‘తత్వం’ తర్వాత అలాంటి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను.
ఈ సినిమా చేయడానికి మేము ఎదుర్కొన్న కష్టాలు నేను గతంలో చేసిన మరే సినిమాకూ ఎదుర్కోలేదు. దర్శకుడు, నిర్మాతలు కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని చాలా కష్టపడి ఈ సినిమాను ఇక్కడి వరకు తీసుకొచ్చారు.
మేము పడిన కష్టం మొత్తం తెరపై కనిపిస్తుందని నమ్ముతున్నాను. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరం ఎంతో నిజాయితీగా పనిచేశాం.
ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని, సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. చివరికి ప్రేక్షకుల స్పందనే మాకు అన్నింటికంటే ముఖ్యం.

