“Gaddar Award has encouraged me to deliver even better music to audiences – Music Director Mark K Robin
ప్రేక్షకులకు మరింత మంచి సంగీతాన్ని అందించే ప్రోత్సాహాన్ని గద్దర్ అవార్డ్ అందించింది – మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్
– మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంగీతం అందించాలనేది నా డ్రీమ్ – మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్
కొందరు తమ గోరంత ప్రతిభను కొండంతలుగా చెప్పుకుంటారు. మరికొందరు ఎంత ప్రతిభావంతులైనా ప్రచారాలకు దూరంగా ఉంటూ తమ పని తాము చేసుకుపోతుంటారు. ఈ రెండో కేటగిరీకి చెందిన యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్. తన 8 ఏళ్ల సంగీత ప్రస్థానంలో 20 కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు మార్క్ కె రాబిన్. వాటిలో నాగార్జున నటించిన ది ఘోస్ట్, ప్రియదర్శి మల్లేశం, తేజ సజ్జ జాంబీరెడ్డి, తాప్సీ మిషన్ ఇంపాజిబుల్, నవీన్ పోలిశెట్టి నటించిన ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ వంటి విజయవంతమైన చిత్రాలున్నాయి. తాజాగా దండోరా సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డ్ ను సొంతం చేసుకున్నారు మార్క్ కె రాబిన్. ఈ సందర్భంగా సంగీత దర్శకుడిగా తన ప్రస్థానాన్ని, తన ప్రయాణంలోని విశేషాలను వెల్లడించారు.
– దండోరా సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా గద్దర్ అవార్డ్ దక్కడం సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు మరింత మంచి మ్యూజిక్ ఇచ్చేందుకు ఒక స్ఫూర్తిగా ఈ అవార్డ్ నిలుస్తుందని నమ్ముతున్నాను. గద్దర్ అవార్డ్ తో సంగీత దర్శకుడిగా నాపై మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నాను. గద్దర్ అవార్డ్ ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిఫ్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గార్లకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా డైరెక్టర్ మురళి చాలా క్లారిటీగా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలోని కథాంశమే నన్ను మంచి మ్యూజిక్ ఇచ్చేందుకు ఇన్స్ పైర్ చేసింది. కులాల మధ్య ఉన్న అడ్డుగోడలు, చివరకు చనిపోయాక అంతిమ సంస్కారాలు కూడా చేయకుండా అడ్డుకోవడం, ఒక బ్రిడ్జి మీద నుంచి శవాలను నీటిలోకి దింపడం వంటివి దర్శకుడు చెప్పాక నా మనసు చలించింది. భావోద్వేగం నిండిన మనసుతోనే దండోరా సినిమాకు సంగీతాన్ని అందించాను. దండోరా సినిమాలో స్థానిక వాయిద్యాలతో సంగీతం కంపోజ్ చేశాను. నేను మల్లేశం సినిమాకు మ్యూజిక్ చేసేప్పుడే నాకు ఈ స్థానిక వాయిద్యాలు, స్థానిక సంగీతం మీద అవగాహన ఉంది. ఆ అనుభవం దండోరా సినిమాకు నాకు ఉపయోగపడింది.
– నాకు బాల్యం నుంచే సంగీతం మీద ఇష్టం ఉండేది. నేను టీచర్ గా వర్క్ చేశాను. లిరిసిస్ట్ కృష్ణకాంత్ నాకు మంచి మిత్రుడు. కృష్ణకాంత్, ప్రశాంత్ వర్మ, నేను కలుస్తుండేవాళ్లం. ప్రశాంత్ నేను కలిసి డైలాగ్ ఇన్ ది డార్క్ అనే ఇండియా ఫస్ట్ వర్చువల్ ఆడియో షార్ట్ ఫిలిం చేశాం. నాని హీరోగా నటించిన మజ్ను మూవీ ట్రైలర్ కు బీజీఎం ఇచ్చాను. ఆ ట్రైలర్ కు నేను అందించిన సంగీతం నచ్చి నాని తను నిర్మిస్తున్న అ..! సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం కల్పించారు. ఆ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. అలా టాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత 8 ఏళ్ల ప్రయాణంలో ది ఘోస్ట్, మల్లేశం, జాంబీరెడ్డి, మిషన్ ఇంపాజిబుల్, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, సూర్యకాంతం…ఇలా 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించాను. సినిమాలు చేసుకుంటూ వెళ్లడమే గానీ వాటి గురించి మీడియా ఇంటర్వ్యూస్ లో, ఇతర ప్రచార కార్యక్రమాల్లో ఎక్కువగా చెప్పుకోలేదు. నేను కాస్త ఇంట్రోవర్ట్.
– నాకు కమర్షియల్ సినిమాలు చేయడం ఇష్టం. నా ఫస్ట్ వర్క్ నాని మజ్ను సినిమాకు చేశా. అది కమర్షియల్ మూవీ. స్టార్ హీరోస్ కు ఎలాంటి బీజీఎం ఇవ్వాలి అనేది పూర్తిగా అవగాహన ఉంది. ప్రభాస్ గారి కోసం కొన్ని బీజీఎంలు చేసి పెట్టాను. మెగాస్టార్ చిరంజీవి గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాకు మ్యూజిక్ చేయాలనేది నా డ్రీమ్. ఇటీవల గద్దర్ అవార్డ్స్ లో ఆయనను కలిసి దగ్గరగా చూశాను, షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఆ సందర్భం ఒక స్వీట్ మెమొరీగా గుర్తుండిపోతుంది.
– ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్స్ యూత్ కు నచ్చే మంచి మంచి సౌండింగ్స్ ఇవ్వగలుగుతున్నారు. కానీ కలకాలం గుర్తుండిపోయే ట్యూన్స్ ఇవ్వలేకపోతున్నారు. అందుకే ఇప్పటి యూత్ ఏఆర్ రెహమాన్, ఇళయరాజా పాటలు వింటూ ఆ పాటలకు డ్యాన్సులు చేస్తున్నారు. ఇప్పటి పాటల్లో శబ్దాల హోరు పెరిగింది. సాహిత్యం వినిపించడం లేదు. ట్యూన్ శరీరం అయితే, సాహిత్యం ఆత్మ లాంటిది అని నా అభిప్రాయం. పరభాషా సంగీత దర్శకులు, సింగర్స్ ను మనం ప్రోత్సహిస్తున్నాం. మంచిదే కానీ వారికి మన భాష మీద పట్టులేక తెలిసినంతలో అలాగే పాడుతున్నారు. దాంతో వాళ్ల ఉచ్చారణల్లో తప్పులు వస్తున్నాయి. నా సినిమాల్లో సాధ్యమైనంత మన వాళ్లతోనే పాడిస్తున్నాను.
– నేను చేసే పాటలన్నీ మంచి సాహిత్యంతో, గుర్తుండిపోయే ట్యూన్ తో ఉండాలనే ప్రయత్నిస్తుంటాను. అయితే సినిమా సంగీతం ఎప్పుడూ ఒక పరిధిలోనే ఉంటుంది. అంటే దర్శకుడి టేస్ట్ మేరకు మేము పాటలు కంపోజ్ చేయాలి. మంచి మ్యూజిక్ టేస్ట్ ఉన్న దర్శకులతో పనిచేసినప్పుడే మంచి పాటలు చేయగలం. మణిరత్నం లాంటి దర్శకుల సినిమాల్లో సంగీత పరంగా ఆ ప్రత్యేకత మనం గమనించగలం.
– సంగీతంలో టెక్నాలజీ ఎంత అందుబాటులోకి వచ్చినా మనం సొంతంగా క్రియేట్ చేసే పాటతో అది పోటీ రాదు. మనలోని సృజనాత్మకతతో రూపొందించే పాటను అంతే అనుభూతితో ఏఐ అందించలేదు. ఏఐకి కూడా మన ఇన్ పుట్స్ అవసరం. ఫలానా పాట చేయమని సూచనలు చేస్తే అలాంటి పాటే చేసి ఇస్తుంది.
– తెలుగు సినిమా పరిశ్రమ గొప్పగా ఎదిగింది. ఇక్కడ గొప్ప చిత్రాలు నిర్మిస్తున్నాం. అయితే మ్యూజిక్ ఇండస్ట్రీ పరంగా ఇక్కడ ఆ స్థాయి సౌకర్యాలు లేవు. ఒక మంచి మ్యూజిక్ స్టూడియో, ఒక మంచి రికార్డింగ్ చేయాలంటే చెన్నైకి వెళ్తున్నాం. మన ఇండస్ట్రీ పెరిగినంత స్థాయిలో, మన సినిమా అవసరాలు తీర్చేంత మ్యూజిక్ స్టూడియోలు, వాయిద్యకారులు అందుబాటులో లేరు. మీకు ఏ వాయిద్యం కావాలన్నా వాయించగల వారు చెన్నైలో అందుబాటులో ఉంటారు. వాళ్ల సమయపాలన, సంగీత ప్రతిభ ఆశ్చర్యపరుస్తాయి. కోవిడ్ టైమ్ లో మనకున్న అరా కొరా రికార్డింగ్ స్టూడియోల్లో కూడా కనీస ఉపాధి, వ్యాపారం లేకుండా పోయాయి. ఇప్పుడిప్పుడే వారికి కొంత ఉపాధి లభిస్తోంది. చెన్నై మీద ఆధారపడే పరిస్థితి పూర్తిగా మారాల్సిన అవసరం ఉంది. అలాగే స్థానిక వాయిద్యకారులను, సంగీత కళాకారులను గుర్తించి ప్రోత్సాహం అందించాలి. అలాంటి ఒక మంచి లోకల్ టీమ్ ను తయారుచేసే ప్రయత్నాలు చేస్తున్నాను.
– ప్రస్తుతం కథాకళి అనే ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ప్రశాంత్ వర్మ గారితో రెండు మూవీస్ చేస్తున్నాను. ఒక స్టార్ హీరో సినిమాకు చర్చలు జరుగుతున్నాయి. త్వరలో వెల్లడిస్తాను.
