Avengers Doomsday Special Promo Unveiled, Robert Downey Jr. Stuns as Doctor Doom
Avengers: Doomsday Special Promo Unveiled, Robert Downey Jr. Stuns as Doctor Doom
మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ సూపర్‌హీరో మూవీ **‘అవెంజర్స్: డూమ్స్‌డే’**పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోని పలువురు అగ్రశ్రేణి సూపర్‌హీరోలు, ప్రముఖ నటులు ఒకే సినిమాలో కనిపించనుండటంతో ఈ చిత్రంపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ‘అవెంజర్స్: డూమ్స్‌డే’కు సంబంధించిన ప్రత్యేక ప్రోమోను మార్వెల్ స్టూడియోస్ విడుదల చేసింది.
D23: ది అల్టిమేట్ డిస్నీ ఫ్యాన్ ఈవెంట్ వేదికగా ఈ ప్రత్యేక ప్రోమోను ఆవిష్కరించారు. మార్వెల్ స్టూడియోస్ అధ్యక్షుడు కెవిన్ ఫైజీతో పాటు ఆస్కార్ విజేత రాబర్ట్ డౌనీ జూనియర్, నటులు క్రిస్ ఎవాన్స్, హేలీ అట్వెల్ తదితరులు వేదికపై సందడి చేశారు. ప్రోమో విడుదలతో మార్వెల్ అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.
ఈ ప్రోమోలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం రాబర్ట్ డౌనీ జూనియర్ లుక్. ఇప్పటివరకు MCUలో ఐరన్ మ్యాన్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన, ఇప్పుడు పూర్తిగా భిన్నమైన అవతారంలో విక్టర్ వాన్ డూమ్, డాక్టర్ డూమ్‌గా కనిపించనున్నారు. హీరోగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటుడు ఇప్పుడు MCUలో అత్యంత శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించనుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
ప్రోమోలో వెనెస్సా కిర్బీ పోషిస్తున్న సూ స్టార్మ్ పాత్ర కూడా కీలకంగా కనిపిస్తోంది. డాక్టర్ డూమ్‌కు సంబంధించిన కథలోని కొన్ని ఆసక్తికరమైన అంశాలను ఆమె పాత్ర ద్వారా పరిచయం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డాక్టర్ డూమ్, థోర్ మధ్య జరగబోయే భారీ పోరాటానికి సంబంధించిన సంకేతాలు కూడా ప్రోమోలో కనిపించడం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
‘అవెంజర్స్: డూమ్స్‌డే’కు ఆంథోనీ రస్సో, జో రస్సో దర్శకత్వం వహిస్తున్నారు. కెవిన్ ఫైజీ, లూయిస్ డి’ఎస్పోసిటో, జోనాథన్ ష్వార్ట్జ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో రాబర్ట్ డౌనీ జూనియర్‌తో పాటు క్రిస్ ఎవాన్స్, క్రిస్ హేమ్స్‌వర్త్, పెడ్రో పాస్కల్, పాల్ రూడ్, ఆంథోనీ మాకీ, ఫ్లోరెన్స్ ప్యూ, వెనెస్సా కిర్బీ, చానింగ్ టాటమ్, సిము లియు, ఇయాన్ మెక్‌కెల్లెన్, టామ్ హిడిల్స్టన్, జేమ్స్ మార్స్డెన్, ప్యాట్రిక్ స్టీవర్ట్, జోసెఫ్ క్విన్, సెబాస్టియన్ స్టాన్, డేవిడ్ హార్బర్ తదితర ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మూడు విభిన్న విశ్వాలకు చెందిన హీరోలు ఒకే వేదికపైకి చేరి, ఇంతకుముందెన్నడూ ఎదుర్కోని అత్యంత ప్రమాదకరమైన ముప్పును ఎదుర్కొనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మల్టీవర్స్ కాన్సెప్ట్, భారీ యాక్షన్, స్టార్ కాస్ట్, డాక్టర్ డూమ్ పాత్ర వంటి అంశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
భారీ స్థాయిలో రూపొందుతున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ 2026 డిసెంబర్ 18న భారత్‌లో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజాగా విడుదలైన ప్రత్యేక ప్రోమోతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
