Samakhya Global Business Meet–2026 on Oct 14–15 in Hyderabad
హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’
సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. కార్యక్రమానికి హాజరుకానున్న పద్మవిభూషణ్ చిరంజీవి
హైదరాబాద్, అక్టోబర్ 10: వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలను కల్పించే లక్ష్యంతో సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ (SCC) ఆధ్వర్యంలో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’ నిర్వహించనున్నారు. అక్టోబర్ 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు జరగనుంది.
అక్టోబర్ 14న ఉదయం 10.30 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను ప్రారంభించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు పద్మవిభూషణ్, మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్ సైతం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
వ్యాపార భాగస్వామ్యాలను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త మార్కెట్లను అన్వేషించడం, పారిశ్రామిక రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించడం ఈ గ్లోబల్ బిజినెస్ మీట్ ప్రధాన లక్ష్యాలు. ఈ సదస్సు ద్వారా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వ్యాపార సంస్థల ప్రతినిధులకు ఒకే వేదికపై కలుసుకుని తమ ఆలోచనలను పంచుకునే అవకాశం లభించనుంది. తద్వారా దక్షిణ భారతదేశంలో వ్యాపార, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త మార్గాలు ఏర్పడతాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEs), స్టార్టప్‌లు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించడంపై ఈ సదస్సులో దృష్టి సారించనున్నారు. నూతన ఆవిష్కరణలు, వ్యాపార విస్తరణ, పెట్టుబడుల అవకాశాలు, పారిశ్రామిక రంగంలో వృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.
ఈ కార్యక్రమంలో సమాఖ్య ప్రతినిధులు టీవీఎన్ రావు, పీవీ రావు, ఏవీ రత్నం, తోట చంద్రశేఖర్, రజనీకాంత్ తదితరులు పాల్గొననున్నారు.
సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026 ద్వారా వ్యాపార రంగంలో కొత్త భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తూ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరిన్ని అవకాశాలు కల్పించడం, పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడటం లక్ష్యంగా సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందుకు సాగుతోంది.
