Teja Sajja
‘ది ట్రెయిటర్స్’ను హోస్ట్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. ఇది మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చూస్తున్నంత ఎక్సైటింగ్‌గా ఉంటుంది: తేజ సజ్జా
ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రియాలిటీ గేమ్ ఫార్మాట్ ‘ది ట్రెయిటర్స్’ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ పేరుతో రూపొందిన ఈ షోకు సూపర్ హీరో తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. విభిన్న రంగాలకు చెందిన 20 మంది సెలబ్రిటీలు ఈ గేమ్‌లో పాల్గొంటున్నారు.
మొత్తం 10 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ షోలో నమ్మకమే ప్రమాదంగా మారే ఒక ఆసక్తికరమైన ప్రపంచంలోకి కంటెస్టెంట్స్ అడుగుపెడతారు. ఎవరిని నమ్మాలి? ఎవరిని అనుమానించాలి? అసలు ట్రెయిటర్స్ ఎవరు? అమాయకులు ఎవరు? అనే ప్రశ్నల చుట్టూ ఈ గేమ్ సాగుతుంది. SOL Production నిర్మించిన ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ తెలుగు భాషలో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 15 నుంచి ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్ విడుదల కానుంది.
ఈ సందర్భంగా తేజ సజ్జా మీడియాతో ముచ్చటించి షో విశేషాలను పంచుకున్నారు.

వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మీరు ‘ది ట్రెయిటర్స్’కు హోస్ట్‌గా మారడం ఎలా అనిపించింది?
‘ది ట్రెయిటర్స్’ అనేది గ్లోబల్‌గా చాలా పెద్ద హిట్ అయిన ఫ్రాంచైజ్. ఇప్పటికే 20కి పైగా దేశాల్లో, 25కి పైగా భాషల్లో ఈ ఫార్మాట్‌ను రూపొందించారు. హిందీ వెర్షన్‌ను కరణ్ జోహార్ గారు చేసినప్పుడు మొదట నాకు పెద్దగా అవగాహన లేదు. కానీ ఒక ఎపిసోడ్ చూడటం మొదలుపెట్టి, రెండు రోజుల్లో మొత్తం సీజన్ పూర్తి చేశాను. అప్పుడే ఈ కాన్సెప్ట్, ఫార్మాట్ నాకు చాలా నచ్చాయి.
‘మిరాయ్’ సినిమా పూర్తయిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి నన్ను సంప్రదించారు. నా కెరీర్లో ఇంత త్వరగా ఓకే చేసిన ప్రాజెక్ట్ బహుశా ఇదే. ఈ ఫార్మాట్‌పై నాకు అంత నమ్మకం కలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని భాషల్లో విజయవంతమవడానికి కారణం కూడా ఆ ఫార్మాట్లో ఉన్న స్ట్రెంగ్త్. అందుకే వెంటనే ఓకే చేశాను.
ప్రైమ్ వీడియో లాంటి అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. తెలుగులో ఇంత పెద్ద స్కేల్లో ఇలాంటి రియాలిటీ షో ఇప్పటివరకు చూడలేదు. అన్నింటికంటే ఈ ఫార్మాట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నిజంగా ఒక మర్డర్ మిస్టరీ సినిమా లేదా థ్రిల్లర్ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ షోను హోస్ట్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను.
షో షూటింగ్ ఎన్ని రోజులు జరిగింది? హోస్ట్‌గా మీ అనుభవం ఎలా ఉంది?
మొత్తం 11 రోజులు షూట్ చేశాం. 10 ఎపిసోడ్లు ఉన్నాయి. నేను హిందీ వెర్షన్ చూసేటప్పుడు అందులో పాల్గొన్నవాళ్లతో నాకు ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్ లేదు. వాళ్లు ఎవరో కూడా వ్యక్తిగతంగా తెలియదు. కానీ తెలుగులో ప్రగతి గారు, హర్షవర్ధన్ గారు, చిన్మయి గారు.. ఇలా మనకు బాగా తెలిసిన వాళ్లు పాల్గొన్నారు. వాళ్లు గేమ్‌లో ఎలా బిహేవ్ చేస్తారు? ఎలాంటి స్ట్రాటజీలు ప్లే చేస్తారు? అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
అలాగే హోస్ట్ క్యారెక్టర్ కూడా ఈ షోలో చాలా కీలకం. ఒక సినిమాలో ఒక క్యారెక్టర్‌ను పోషించినట్టే, నేను కూడా ఒక నిర్దిష్ట హోస్ట్ క్యారెక్టర్లోనే ఉండాలి. అది నాకు చాలా కొత్తగా, ఆసక్తికరంగా అనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే క్లాస్ లీడర్ లాంటి క్యారెక్టర్ అన్నమాట. (నవ్వుతూ)
‘ది ట్రెయిటర్స్ తెలుగు’ గేమ్ ఎలా ఉండబోతోంది?
మొదటి మూడు ఎపిసోడ్లు చూసిన తర్వాత ఈ గేమ్ షో ఎలా ఉండబోతోందో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వస్తుంది. మొత్తం షో ఒక మర్డర్ మిస్టరీలా సాగుతుంది. తెలుగులో ఇప్పటివరకు చూసిన రియాలిటీ షోలకు దీనికి అసలు పోలిక ఉండదు.
ఇది చాలా కొత్త ఫార్మాట్. ఒక రియాలిటీ షోలా కాకుండా నిజమైన గేమ్ ఆడుతున్న అనుభూతి కలుగుతుంది. ఫుట్‌బాల్, చెస్ వంటి గేమ్స్‌కు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం గేమ్ ముందుకు సాగుతుంది. ‘ది ట్రెయిటర్స్’ కూడా అదే విధంగా పూర్తిస్థాయి గేమ్‌లా ఉంటుంది.
ఇది కొత్త గేమ్ షో కాబట్టి ప్రేక్షకులకు సులభంగా అర్థమవుతుందా?
చాలా ఈజీగా అర్థమవుతుంది. మొదటి మూడు ఎపిసోడ్లు విడుదలవుతాయి. వాటిని చూస్తే అసలు గేమ్ ఏంటి? ఎలా ఆడాలి? అనే దానిపై క్లారిటీ వచ్చేస్తుంది.
ఎవరిని నమ్మాలి? ఎవరిని అనుమానించాలి? ఎవరు ట్రెయిటర్స్? ఎవరు అమాయకులు? అనే ప్రశ్నల చుట్టూ గేమ్ సాగుతుంది. అందుకే ప్రతి ఎపిసోడ్ ఒక థ్రిల్లర్‌లా అనిపిస్తుంది. ప్రేక్షకులు కూడా కంటెస్టెంట్స్‌తో పాటు గేమ్‌లో ఇన్వాల్వ్ అవుతారు.
కంటెస్టెంట్స్‌ను ఏ ప్రాతిపదికన సెలెక్ట్ చేశారు?
ఈ గేమ్‌లో పాల్గొనే వాళ్లు చాలా ముఖ్యం. వాళ్లు మానిపులేట్ చేయగలగాలి, ఎదుటివాళ్లను నమ్మించగలగాలి, పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోగలగాలి. అదే సమయంలో గేమ్ రూల్స్‌ను అర్థం చేసుకుని తెలివిగా ముందుకు వెళ్లాలి.
అందుకే దాదాపు అన్ని రంగాల నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేశారు. ఇందులో సెలబ్రిటీగా ఉండటం అనేది ప్రధాన ప్రాధాన్యత కాదు. గేమ్‌ను ఎంత బాగా ఆడగలరు అనేదే ముఖ్యమైన విషయం.
కోటి రూపాయల ప్రైజ్ మనీ అంటున్నారు. దాని డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది?
అది మీరు గేమ్ షో చూసి తెలుసుకోవాలి. (నవ్వుతూ) ముందే చెప్పేస్తే గేమ్‌లో ఉన్న కిక్ పోతుంది.
హోస్ట్‌గా ఈ షో చేయడం ఎలా అనిపించింది?
నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఎందుకంటే నాకు ఈ షో ఫార్మాట్ చాలా ఇష్టం. నేను సాధారణంగా ఎలాంటి బెరుకు లేకుండా మాట్లాడతాను. కాబట్టి హోస్టింగ్ కూడా చాలా ఈజీగా చేయొచ్చని మొదట అనుకున్నాను.
కానీ మొదటి రోజే నాలుగైదు పేజీల కంటెంట్ ఇచ్చారు. పార్టిసిపెంట్స్‌కు గేమ్ రూల్స్ మొత్తం వివరించాలి. అదంతా సింగిల్ టేక్‌లో చెప్పాలి. ఎక్కడా తేడా రాకూడదు.
సాధారణంగా స్టూడియోలో చేసే రియాలిటీ షోల్లో అవసరమైతే కట్ చేయొచ్చు. కానీ ఇందులో కంటెస్టెంట్స్ నా ఎదురుగానే ఉంటారు. కాబట్టి ఏదైనా తప్పు అయితే వెంటనే తెలిసిపోతుంది. మొత్తం సింగిల్ టేక్‌లోనే చేయాలి. అది ఒక కొత్త ఛాలెంజ్‌గా అనిపించింది. కానీ అదే సమయంలో చాలా ఎంజాయ్ చేశాను.
పిల్లలు కూడా మీకు చాలా పెద్ద ఫ్యాన్ బేస్. ఈ షో వారికి కూడా నచ్చుతుందా?
ఖచ్చితంగా నచ్చుతుంది. ఏడెనిమిదేళ్ల పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఎంజాయ్ చేసేలా ఈ షో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫార్మాట్‌కు పిల్లల్లో కూడా మంచి పాపులారిటీ, ఫాలోయింగ్ ఉంది.
‘జాంబీ రెడ్డి 2’ గురించి ఏమైనా చెప్పగలరా?
రీసెంట్గా షూటింగ్ స్టార్ట్ చేశాం. ఈసారి చాలా క్రేజీ ఎంటర్టైనర్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ‘జాంబీ రెడ్డి’కి సీక్వెల్ కావడంతో ప్రేక్షకుల్లో కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమాను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాం.




