Sree Vishnu’s ‘Comrade Kalyan’ Set for Grand Worldwide Release on October 9
అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ‘కామ్రేడ్ కళ్యాణ్’ గ్రాండ్ రిలీజ్
‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ శ్రీ విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం **‘కామ్రేడ్ కళ్యాణ్’**పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్, కామెడీ అంశాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జనకిరామ్ మరెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో, వెంకట కృష్ణ కర్ణాటి, సీతా కర్ణాటి నిర్మాతలుగా స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది.
1992లో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో సాగే ఈ కథలో శ్రీ విష్ణు ఇప్పటివరకు చూడని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌తో పాటు తొలి రెండు పాటలకు మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
తాజాగా చిత్ర బృందం సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. దసరా పండుగకు ముందు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఫెస్టివల్ సీజన్‌ను టార్గెట్ చేస్తోంది.
విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇందులో శ్రీ విష్ణు ముదురు ఆకుపచ్చ దుస్తుల్లో, మెడలో ఎర్ర కండువాతో కామ్రేడ్ లుక్‌లో కనిపిస్తున్నారు. భుజంపై తుపాకీ వేసుకుని అడవిలో నడుస్తున్న ఆయన లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీ విష్ణుతో పాటు సత్య, ముక్కు అవినాష్ కూడా కామ్రేడ్లుగా పోస్టర్లో కనిపిస్తున్నారు.
తుపాకులు, అడవి నేపథ్యం సినిమాకు సీరియస్, విప్లవాత్మక వాతావరణాన్ని ప్రతిబింబిస్తుండగా.. నటీనటుల ముఖాల్లో కనిపిస్తున్న ఉత్సాహభరితమైన హావభావాలు సినిమాలో వినోదానికి కూడా పెద్దపీట వేసినట్లు సూచిస్తున్నాయి. యాక్షన్‌తో పాటు కామెడీ, ఎమోషన్‌కు ప్రాధాన్యత ఇస్తూ దర్శకుడు జనకిరామ్ మరెళ్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విభిన్నమైన కథాంశం, ఆసక్తికరమైన పీరియడ్ బ్యాక్‌డ్రాప్, శ్రీ విష్ణు సరికొత్త అవతారం ‘కామ్రేడ్ కళ్యాణ్’కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
సాంకేతికంగా కూడా ఈ చిత్రానికి మంచి టీమ్ పనిచేస్తోంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఛోటా కె. ప్రసాద్ ఎడిటింగ్‌ను చూసుకుంటున్నారు.
టైటిల్ గ్లింప్స్, పాటలకు వచ్చిన స్పందనతో జోష్ మీదున్న చిత్ర బృందం.. ఇప్పుడు విడుదల తేదీని ప్రకటించడంతో ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేయనుంది. దసరా సీజన్లో ప్రేక్షకులను అలరించేందుకు ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
