Bhogapuram Airport
భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి ప్రయాణికుడికి ఆర్.వి.వి. సత్యనారాయణ ఘనస్వాగతం
ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నంగా భావించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 17న వైభవంగా ప్రారంభమైంది. ఈ చారిత్రాత్మక సందర్భంలో తొలి అంతర్జాతీయ ప్రయాణికుడికి అందించిన ప్రత్యేక స్వాగతం అందరి దృష్టిని ఆకర్షించింది.
అల్లూరి సీతారామరాజు వీరగాథ ఆధారంగా తెరకెక్కిన ‘మన్యం ధీరుడు’ చిత్రంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన కథానాయకుడు ఆర్.వి.వి. సత్యనారాయణ, విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకల్లో అల్లూరి సీతారామరాజు వేషధారణలో పాల్గొన్నారు. అదే పాత్రలో తొలి అంతర్జాతీయ ప్రయాణికుడికి ఆత్మీయంగా స్వాగతం పలకడం ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వీరత్వం, గాంభీర్యం ఉట్టిపడేలా అల్లూరి రూపంలో సత్యనారాయణ విమానాశ్రయ ప్రాంగణంలో కనిపించడంతో ప్రయాణికులు, సిబ్బంది, సందర్శకులు ఆసక్తిగా ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. అల్లూరి సీతారామరాజు పాత్రను తెరపై పోషించిన నటుడు అదే వేషధారణలో చారిత్రాత్మక విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి స్వాగతం పలకడం పలువురిని ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా హీరో ఆర్.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో భాగస్వామి కావడం తనకు ఎంతో గర్వకారణమని తెలిపారు.
“ఉత్తరాంధ్ర తలమానికంగా నిర్మితమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి గడ్డపై, నా చిత్రంలో నేను పోషించిన అదే అల్లూరి వేషధారణలో వచ్చి తొలి ప్రయాణికుడికి స్వాగతం పలకడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. నటుడిగా నన్ను గుర్తించి, గౌరవించి, ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వామిని చేసిన విమానాశ్రయ యాజమాన్యానికి, అధికారులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు,” అని ఆయన అన్నారు.
ఇదే సందర్భంగా ‘మన్యం ధీరుడు’ చిత్రానికి వస్తున్న ఆదరణపై కూడా సత్యనారాయణ స్పందించారు. అల్లూరి సీతారామరాజు జీవిత స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ అవుతోందని, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. కుటుంబ సమేతంగా చిత్రాన్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం వంటి చారిత్రాత్మక సందర్భంలో అల్లూరి సీతారామరాజు వేషధారణలో ఆర్.వి.వి. సత్యనారాయణ పాల్గొనడం వేడుకలకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. అల్లూరి పాత్రతో ఆయనకు ఉన్న అనుబంధం, విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఈ సందర్భాన్ని మరింత గుర్తుండిపోయేలా చేశాయి.
