Jaiho Ramanuja
‘జయహో రామానుజ’ సాంగ్ లాంచ్.. అక్టోబర్ 25న గ్రాండ్ రిలీజ్
ఘనంగా ‘జయహో రామానుజ’ సాంగ్ లాంచ్ ఈవెంట్.. అక్టోబర్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జయహో రామానుజ’. సుదర్శనం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమెరికన్ నటి జో శర్మ కథానాయికగా నటిస్తున్నారు. సుమన్, ప్రవళ్లిక తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సమాజంలో సమానత్వం, మానవతా విలువలను చాటిన మహనీయుడు శ్రీ రామానుజాచార్యుల జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో అక్టోబర్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు ఈ సినిమా సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ‘జయహో రామానుజ’ చిత్రంలోని సాంగ్ లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, చిత్ర యూనిట్ సభ్యులు హాజరై సినిమా విజయాన్ని ఆకాంక్షించారు.
నిర్మాత, నటి ప్రవళ్లిక
నిర్మాత, నటి ప్రవళ్లిక మాట్లాడుతూ.. “జయహో రామానుజ సినిమాను నిర్మించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిర్మాణ బాధ్యతలు నిర్వహించడంతో పాటు ఈ సినిమాలో కృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి పాత్రల్లో నటించాను. సమసమాజం కోసం పాటుపడిన రామానుజాచార్యుల వారి గొప్పతనాన్ని ఈ తరానికి మరింతగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను రూపొందించాం.
ఈ సినిమా ప్రయాణం నాకు ఎన్నో విషయాలను నేర్పింది. ఆ అనుభవాలన్నింటినీ నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఇలాంటి గొప్ప చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ప్రేక్షకులందరూ ఈ సినిమాను తప్పకుండా ఆదరించాలని కోరుకుంటున్నాను. అక్టోబర్ 25న సినిమాను వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం” అన్నారు.

టీఎఫ్‌పీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్
టీఎఫ్‌పీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. “రామానుజాచార్యుల వారి ఘనతను ఈ తరానికి తెలియజేయడంలో చినజీయర్ స్వామితో పాటు సాయి వెంకట్ కూడా అభినందనలకు అర్హులు. సాయి వెంకట్ అనుకుంటే ఏదైనా కమర్షియల్ సినిమా చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ మనుషులంతా ఒక్కటేననే గొప్ప సందేశాన్ని చాటిన రామానుజాచార్యుల వారి జీవిత కథను ఈ తరం ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ప్రయత్నం చేయడం నిజంగా ప్రశంసనీయం” అన్నారు.
లయన్ డా. సాయి వెంకట్
నటుడు, దర్శకుడు లయన్ డా. సాయి వెంకట్ మాట్లాడుతూ.. “కులం లేదు, మతం లేదు.. మనుషులంతా ఒక్కటే, అందరూ సమానమే అని చాటిన గొప్ప మహనీయుడు రామానుజాచార్యులు. ఈ సినిమా రూపొందిస్తున్న సమయంలో నా జీవితంలో ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరిగాయి. టీటీడీకి రూ.20 లక్షలు విరాళంగా ఇవ్వగలిగాను అంటే అది రామానుజాచార్యుల వారి మహిమగానే భావిస్తున్నాను.
ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేసి ఘనంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో హై క్వాలిటీ తీసుకురావాలనే ఉద్దేశంతో రిలీజ్ కొంత ఆలస్యమైంది.
ఆ కాలంలో బ్రాహ్మణులకు మాత్రమే దేవాలయాల్లో ప్రవేశం ఉండేది. అలాంటి సమయంలో రామానుజాచార్యులు ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొచ్చారు. ‘మనుషులంతా ఒక్కటే కదా.. అలాంటప్పుడు ఇతరులకు ఆలయ ప్రవేశం ఎందుకు ఉండకూడదు?’ అని ప్రశ్నించి సమాజంలో చైతన్యం తీసుకొచ్చారు. అందరికీ ‘ఓం నమో నారాయణ’ మంత్రాన్ని నేర్పించి, ప్రతి ఒక్కరూ వైష్ణవులే అనే సమానత్వ భావనను చాటారు.
మా ‘జయహో రామానుజ’ సినిమాను అక్టోబర్ 25న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కరూ సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు సముద్ర
దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. “రామానుజాచార్యులు పదో శతాబ్దంలో జీవించి సమాజంలో అందరూ సమానమే అనే గొప్ప సందేశాన్ని చాటారు. అలాంటి మహనీయుడి జీవిత కథతో సినిమా రూపొందించి సాయి వెంకట్ తన జన్మను చరితార్థం చేసుకున్నారు.
అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘జయహో రామానుజ’ సాయి వెంకట్‌కు గొప్ప పేరు తీసుకురావడంతో పాటు మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నిర్మాత రామసత్యనారాయణ
నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. “రాముడు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ గుర్తుకువస్తారు. సాయిబాబా, ఏసుప్రభు అంటే విజయచందర్ గుర్తుకువస్తారు. అదే విధంగా వెండితెరపై రామానుజాచార్యులు అంటే ఇకపై సాయి వెంకట్ గుర్తుకువచ్చేలా ఈ సినిమా ఉండాలని కోరుకుంటున్నాను.
‘జయహో రామానుజ’ నిజమైన పాన్ ఇండియా సినిమా. ఈ చిత్రంలో సాయి వెంకట్ ఏకంగా పదకొండు క్యారెక్టర్లలో నటించడం సాధారణ విషయం కాదు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చూసి ఆదరించాలని కోరుతున్నాను” అన్నారు.
నిర్మాత మోహన్ గౌడ్
నిర్మాత మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. “సాయి వెంకట్ నాకు మంచి మిత్రుడు. అయితే ఈ కార్యక్రమానికి వస్తూ పోస్టర్‌పై ఆయనను రామానుజాచార్యులుగా చూసి మైమరచిపోయి దండం పెట్టాను. ఆయన రామానుజాచార్యుల పాత్రలో ఎంతో సహజంగా కనిపిస్తున్నారు. ఈ సినిమా సాయి వెంకట్‌కు గొప్ప పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.
ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట బోర్డు మెంబర్ డా. లక్ష్మీ నారాయణ, ఓబీసీ కన్వీనర్ మల్లేష్, అన్నపూర్ణ, ప్రొఫెసర్ కిరణ్, శ్రీనివాస్, నిర్మాత మోహన్ గౌడ్, నటుడు రాంకీ, సత్యనారాయణ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
