Popular Folk Star Kittu Pavan Makes His Acting Debut as Hero
ప్రముఖ ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం
తెలంగాణ మట్టి వాసనలతో జానపద పాటలకు వందల మిలియన్ల వ్యూస్ సాధించిన ఫోక్ స్టార్ కిట్టు పవన్ ఇప్పుడు హీరోగా వెండితెరపైకి అడుగుపెడుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం శనివారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది.
యం.యస్. వారాహి క్రియేషన్స్, శివమ్ మీడియా పతాకాలపై ప్రొడక్షన్ నం.3గా ముని శివ, శివమల్లాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిలీప్ సాయి నాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మాదాపూర్‌లోని శివమ్ మీడియా కార్యాలయంలో చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకకు ప్రముఖ రచయిత, ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్, దర్శకుడు ఆర్.పీ. పట్నాయక్, నేషనల్ అవార్డు విజేత సతీష్ వేగేశ్న, బిగ్ టీవీ చైర్మన్ విజయ్ వెన్నం ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
దర్శకుడు దిలీప్ సాయి నాయక్‌కు స్క్రిప్ట్‌ను సతీష్ వేగేశ్న, బుల్లెట్‌బండి లక్ష్మణ్ అందించారు. హీరో కిట్టు పవన్‌పై చంద్రబోస్ క్లాప్ ఇచ్చారు. ఆర్.పీ. పట్నాయక్ తొలిషాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. బిగ్ టీవీ చైర్మన్ విజయ్ వెన్నం కెమెరా స్విచాన్ చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
చంద్రబోస్ మాట్లాడుతూ
“ఈ టీమ్ గురించి నాకు చాలా బాగా తెలుసు. టీమ్‌లో ప్రతి ఒక్కరిలో ఎంతో టాలెంట్ ఉంది. నిర్మాతలు ముని శివ, శివమల్లాల, బుల్లెట్‌బండి లక్ష్మణ్, సంగీత దర్శకుడు మదిన్ నాకు ఎంతో ఆత్మీయులు. వీరందరూ కలిసి చేస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.
సతీష్ వేగేశ్న మాట్లాడుతూ
“మంచి కథతో దర్శకుడు దిలీప్ సాయి నాయక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిర్మాతలు ముని శివ, శివమల్లాల ఆయనకు ఎంతో మంచి సపోర్ట్ అందిస్తున్నారు. ఈ టీమ్ అందరికీ సినిమా మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ఆర్.పీ. పట్నాయక్ మాట్లాడుతూ
“ముని శివ, శివమల్లాల మంచి సినిమాలు నిర్మిస్తూ పెద్ద నిర్మాతలుగా ఎదగాలి. భవిష్యత్తులో పదుల సంఖ్యలో మంచి చిత్రాలను నిర్మించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఘన విజయం సాధించాలి” అన్నారు.

హీరో కిట్టు పవన్ మాట్లాడుతూ
“నేను చాలా చిన్న స్థాయి నుంచి ఫోక్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులకు పరిచయం అయ్యాను. తెలంగాణ జానపద పాటలతో నాకు ఎంతో ఆదరణ లభించింది. ఇప్పుడు నేను హీరోగా చేస్తున్న ఈ సినిమాకు ఇంతమంది ప్రముఖులు వచ్చి తమ మద్దతు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నాం” అన్నారు.
తెలంగాణ జానపద సంగీతంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిట్టు పవన్‌కు సోషల్ మీడియాలో భారీగా అభిమానులు ఉన్నారు. ఆయన పాటలు వందల మిలియన్ల వ్యూస్‌ను సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయన హీరోగా నటిస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ సినిమాపై ఫోక్ మ్యూజిక్ అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రానికి మదిన్ సంగీతం అందిస్తుండగా, జనతా బబ్లూ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు మదిన్, కెమెరామెన్ జనతా బబ్లూ, నూతన దర్శకుడు కృష్ణకాంత్‌తో పాటు ఫోక్ ఇండస్ట్రీకి చెందిన పలువురు కళాకారులు పాల్గొన్నారు.
కిట్టు పవన్ హీరోగా, దిలీప్ సాయి నాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం తెలంగాణ జానపద సంస్కృతి, మట్టి వాసనలకు ప్రాధాన్యతనిస్తూ రూపొందనున్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, టైటిల్, విడుదల తేదీ వంటి మరిన్ని వివరాలను చిత్ర బృందం త్వరలో వెల్లడించనుంది.

