‘The Paradise’ Action Will Be on Another Level: Ram-Lakshman
‘ది ప్యారడైజ్’లో యాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.. నాని గారు ప్రాణం పెట్టి పనిచేశారు: ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్
న్యాచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ **‘ది ప్యారడైజ్’**పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.
విభిన్నమైన ప్రపంచం, నాని సరికొత్త గెటప్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
‘ది ప్యారడైజ్’ కోసం ఎంతమంది ఫైట్ మాస్టర్స్ పనిచేశారు?
మేము, నవకాంత్, రియల్ సతీష్ కలిసి ఈ సినిమాకు పనిచేశాం. ఇందులో మేము రెండు భారీ యాక్షన్ బ్లాక్స్‌ను కంపోజ్ చేశాం. సినిమా కథ, ప్రపంచం, పాత్రల బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా యాక్షన్‌ను చాలా కొత్తగా డిజైన్ చేశాం.
నాని క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది?
నాని గారి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడు శ్రీకాంత్ గారు ఆయన పాత్రను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. రెండు జడలతో ఉన్న హీరోను ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు పెద్దగా చూడలేదు. మాకు కూడా ఇది చాలా కొత్తగా అనిపించింది. ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని ఇవ్వాలనే ఉద్దేశంతో నాని గారు కూడా ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డారు.
నాని యాక్షన్ ఎలా ఉండబోతోంది?
నాని గారు ఇంత భారీ స్థాయిలో యాక్షన్ చేయడం ఇదే మొదటిసారి. ఇందులో యాక్షన్ సీన్స్ చాలా హెవీగా ఉంటాయి. ‘దసరా’తో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ యాక్షన్ ‘ది ప్యారడైజ్’లో ఉంటుంది.
రెండు జడలతో యాక్షన్ చేయడం సాధారణ విషయం కాదు. యాక్షన్ చేస్తున్న సమయంలో జడలు రోప్స్‌కు, ముఖానికి తగిలే అవకాశం ఉంటుంది. అందుకే ఈ యాక్షన్‌ను కంపోజ్ చేయడం మాకు కూడా కొత్త అనుభవమే. మా అసిస్టెంట్‌కు కూడా ఇలాంటి జడలు వేయించి, ఆ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను స్వయంగా అర్థం చేసుకున్న తర్వాతే యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేశాం.
నాని ఎంత కష్టపడ్డారు?
నాని గారి కెరీర్లోనే ఈ సినిమా కోసం ఆయన ఇంత కష్టపడి ఉండరని మేం భావిస్తున్నాం. ప్రతి విషయంలోనూ ఆయన 100 శాతం ఎఫర్ట్ పెట్టారు. ఎన్ని టేక్స్ అయినా చేయడానికి సిద్ధంగా ఉండేవారు. ఇంత కష్టపడతారని మేం కూడా ఊహించలేదు.
బేర్ బాడీతో నాని గారు చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా సినిమాలో ఉన్నాయి. అలాంటి సన్నివేశాల కోసం ఫిట్నెస్, బాడీ బిల్డింగ్, డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దర్శకుడు శ్రీకాంత్ తన విజన్ విషయంలో ఎక్కడా రాజీపడరు. ఆయన అనుకున్నది తెరపై వచ్చే వరకు ఎంతో పట్టుదలగా పనిచేశారు. ఆ విజన్‌కు నాని గారు 100 శాతం న్యాయం చేశారు.
యాక్షన్ బ్లాక్స్ పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టింది?
మా యాక్షన్ బ్లాక్స్‌ను పూర్తి చేయడానికి దాదాపు పది రోజులు పట్టింది. ఈ సినిమాలో మనుషులు, వారి బాడీ లాంగ్వేజ్, ప్రపంచం—అన్నీ కొత్తగా ఉంటాయి. దర్శకుడు శ్రీకాంత్ ఎంచుకున్న కథ సహజంగానే యాక్షన్‌ను డిమాండ్ చేస్తుంది. కొన్ని పరిస్థితుల్లో పాత్రలకు తప్పించుకునే అవకాశం ఉండదు.. ఫైట్ చేయాల్సిందే. ఆ పరిస్థితిని ఆయన కథలో చాలా బలంగా క్రియేట్ చేశారు.
యాక్షన్‌ను కంపోజ్ చేయడానికి కూడా చాలా సమయం తీసుకున్నాం. ఇలాంటి బాడీ లాంగ్వేజ్‌తో కూడిన యాక్షన్ ఇంతకుముందు పెద్దగా చూడలేదు. అందుకే ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేశాం. సినిమాలో చాలా రిస్కీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. షూటింగ్ సమయంలో మా యూనిట్లో ఒకరికి గాయం కూడా అయింది.
మోహన్ బాబు గారి పాత్ర ఎలా ఉంటుంది?
మోహన్ బాబు గారు ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. కానీ ‘ది ప్యారడైజ్’లో ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు. ఆయన పాత్రకు కూడా యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. ప్రేక్షకులు ఆయనను కొత్త కోణంలో చూస్తారు.

కొత్త ఫైట్ మాస్టర్స్ వస్తున్నప్పుడు పోటీగా అనిపిస్తుందా?
పోటీ ఉన్నప్పుడే క్రియేటివిటీ పెరుగుతుంది. ఇంకా కొత్తగా ఎలా చేయాలనే ఆలోచన వస్తుంది. మేం కూడా ప్రతిరోజూ మొదటి సినిమా చేస్తున్న ఫైట్ మాస్టర్స్లాగే పనిచేస్తాం. వృత్తి పట్ల భయం, నిజాయితీ, ఏకాగ్రతతో ప్రతి సీన్‌ను చేయడానికి ప్రయత్నిస్తాం.
టెక్నికల్ టీమ్ గురించి?
దర్శకుడు శ్రీకాంత్ ‘ది ప్యారడైజ్’ కోసం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. కెమెరామెన్ సాయి ఆ ప్రపంచాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సినిమాలోని లొకేషన్స్, అక్కడ ఉపయోగించిన పరికరాలు కూడా చాలా కొత్తగా ఉంటాయి. అనిరుద్ గారి మ్యూజిక్ ఇప్పటికే సూపర్ హిట్ అయింది.
మా అబ్బాయి కూడా ‘ది ప్యారడైజ్’లో పనిచేశాడు. అతనికి అన్ని భాషల సినిమాలపై మంచి అవగాహన, పట్టు ఉంది.
నిర్మాత సుధాకర్ చెరుకూరి గురించి?
సుధాకర్ గారు ఎక్కడా రాజీపడకుండా భారీ స్థాయిలో ఖర్చు చేసి ఈ సినిమాను నిర్మించారు. నాని గారు, దర్శకుడు శ్రీకాంత్‌పై పూర్తి నమ్మకంతో ముందుకు వెళ్లారు. నాని, దర్శకుడు, నిర్మాత కలిసి ‘ది ప్యారడైజ్’ను బిగ్ స్కేల్లో రూపొందించారు.
సినిమాకు కావాల్సిన ప్రతి అంశాన్ని భారీ స్థాయిలో సమకూర్చారు. ‘ది ప్యారడైజ్’ ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని, కొత్త యాక్షన్ అనుభూతిని అందిస్తుంది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని మేము నమ్ముతున్నాం.
