‘The Paradise’ Is the Most Challenging Film of My Career: Nani
ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.. సినిమా మొత్తం హైలెట్‌గా ఉంటుంది
న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ముఖ్యంగా సినిమాలో నాని లుక్, యాక్షన్, మేకింగ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం నిర్వహించిన ప్రెస్ మీట్లో న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి తదితరులు పాల్గొని సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా న్యాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మీ అందరినీ కలిసి చాలా రోజులవుతోంది. నా కెరీర్లో ఒక సినిమాకు, మరో సినిమాకు ఇంత గ్యాప్ ఎప్పుడూ రాలేదు. ఈ ప్రెస్ మీట్‌కు వస్తున్నప్పుడు నా మొదటి సినిమాకు ఎంత నెర్వస్‌గా ఉన్నానో, ఇప్పుడు కూడా అంతే నెర్వస్‌గా అనిపించింది. మైక్‌లో మాట్లాడటం కూడా మర్చిపోయినట్టుంది.
ఎట్టకేలకు సెప్టెంబర్ 24న ‘ది ప్యారడైజ్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మొదటి నుంచి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన సపోర్ట్ లభిస్తోంది. ఇదే ప్రేమను సెప్టెంబర్ 24 వరకు కొనసాగిస్తారని నమ్ముతున్నాను.
ఆయా షేర్, ఏషా నాగుల కట్ట, గ్లింప్స్, టీజర్.. ఇలా సినిమా నుంచి ఏ కంటెంట్ విడుదల చేసినా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మీరు ఈ సినిమాను ఇంతగా సొంతం చేసుకున్నట్టు చూస్తుంటే మా బాధ్యత మరింత పెరిగింది. ఈ సినిమాకు ఒక డెస్టినీ ఉందనే బలమైన నమ్మకం కలిగింది.
సెప్టెంబర్ 24న ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించేందుకు నిద్రాహారాలు మానేసి పనిచేస్తున్నాం. మా టార్గెట్ ఒక్కటే. ప్రేక్షకులు భారీ అంచనాలతో థియేటర్‌కు వస్తారని మాకు తెలుసు. వారికి మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఇచ్చి ఇంటికి పంపించాలన్నదే మా ప్రయత్నం. దాని కోసం మేమందరం చాలా కష్టపడుతున్నాం” అని అన్నారు.
‘ది ప్యారడైజ్’ నా సినిమా కాదు.. జనం సినిమా: శ్రీకాంత్ ఓదెల
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. “సినిమా మొదలైనప్పటి నుంచి మీడియా మాకు ఎంతో సపోర్ట్ చేస్తోంది. సినిమా విడుదలయ్యే వరకు ఇదే సపోర్ట్ కొనసాగించాలని కోరుకుంటున్నాను. సినిమా నుంచి ఏది విడుదల చేసినా ప్రేక్షకుల్లో అద్భుతమైన స్పందన వస్తోంది. పాటలు, టీజర్‌కు కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
నా సినిమా అని చెప్పడం కంటే ‘జనం సినిమా’ అని చెప్పడం కరెక్ట్ అనిపిస్తోంది. ప్రేక్షకులు ఈ కంటెంట్‌ను అంతలా ఆదరించారు. ‘ది ప్యారడైజ్’ ఒక రెవల్యూషనరీ ఎమోషనల్ ఫిల్మ్. ఇది ఒక తల్లి, కొడుకుల కథ. అలాగే ఒక సవారీ జాతి కథ.
‘పుట్టుక మనది, చావు మనది, బతుకంతా దేశానిది’ అని కాళోజీ గారు అన్నారు. దేశం కోసం పోరాడిన వారికి ఆ దేశంతోనే సంబంధం లేదని చెబితే.. ఆ తర్వాత వాళ్ల పరిస్థితి ఏమిటి? ఏం చేయాలో తెలియక మరుగునపడిపోయిన ఒక జాతి కథే ‘ది ప్యారడైజ్’. సినిమా కథపై ఒక అవగాహన కోసం ఈ విషయం చెబుతున్నాను. ఇంత ప్రేమ, సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని అన్నారు.
యాక్షన్ సన్నివేశాలు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించాయి
శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ..
ఈ సినిమాలో చాలా ఇంటెన్స్ పదాలు ఉన్నాయి. సెన్సార్ విషయంలో ఇబ్బందులు ఉంటాయని భావిస్తున్నారా?
సినిమాలో చాలా అద్భుతమైన ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్‌ను ప్రేక్షకులకు సరిగ్గా చూపిస్తే ప్రతి ఒక్కరూ కన్విన్స్ అవుతారు.
జడలతో యాక్షన్ చేయడం చాలా కష్టం
నాని మాట్లాడుతూ..
సోషల్ మీడియాలో సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. సినిమాలో అండర్‌వాటర్ సీక్వెన్స్ లేదు. అలాగే వెయ్యి మందితో ఫైట్ కూడా లేదు. ఇది ఒక జెన్యూన్ కథ. అయితే సినిమాలో చాలా యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి. మంచి హై ఇచ్చే సన్నివేశాలు ఉంటాయి. వైలెన్స్‌లో ఉన్న ఎమోషన్‌ను ప్రేక్షకులు ఫీల్ అవుతారు.
జడల విషయానికి వస్తే.. మా కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాస్టర్ ఏదో ఫ్లోలో చెప్పినట్టున్నారు. జడలతో షూటింగ్ చేస్తున్నప్పుడు వాటిని ఒరిజినల్ హెయిర్‌కు అటాచ్ చేసేవాళ్లం. దాంతో సహజంగానే బరువు పెరుగుతుంది. యాక్షన్ సన్నివేశాల్లో అవి రోప్‌కు తగిలి ఇరుక్కుపోయేవి. బహుశా ఆ విషయాలన్నీ టీమ్‌లో చెప్పినట్టుగా ఉంది. ఆయన కూడా ఏదో ఫ్లోలో ఆ విషయం చెప్పేశారు.
అయితే ఈ సినిమాలో జడలతో యాక్షన్ సీక్వెన్స్ చేయడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది.
‘ఆయా షేర్’ కోసం చాలా కష్టపడ్డాను
ఈ సినిమాలో ఇంతకుముందెప్పుడూ లేనంతగా డ్యాన్స్ చేశారు కదా?
‘ఆయా షేర్’ పాటలో ఫ్లోర్ మూవ్మెంట్ కోసం చాలా కష్టపడ్డాను. ఇంతకుముందు నేను డ్యాన్స్‌పై ఎక్కువగా ఫోకస్ చేయలేదు. నా సినిమాల్లో డ్యాన్సింగ్ సాంగ్స్ కూడా ఎక్కువగా ఉండవు. ఎక్కువగా సిచ్యువేషన్‌కు తగ్గ పాటలే ఉంటాయి.
అయితే ఈ సినిమాలోని రెండు డ్యాన్స్ నంబర్స్‌ను ప్రేక్షకులు అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. పాటల విషయంలో శ్రీకాంత్‌కు చాలా మంచి టేస్ట్ ఉంది. సెలబ్రేట్ చేసుకునే పాటలను రూపొందించడంలో తనది ప్రత్యేకమైన అభిరుచి. ఈ రెండు పాటలను కూడా చాలా స్పెషల్ కేర్ తీసుకుని చేయించాడు.
బడ్జెట్ పెరిగినా హ్యాపీగా ఉంది: సుధాకర్ చెరుకూరి
సినిమా బడ్జెట్ ఎక్కువైందని వింటున్నాం?
బడ్జెట్ ఎక్కువైనా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. (నవ్వుతూ)
‘ది ప్యారడైజ్’కు ట్రైలర్ ఉండదు
మిగతా భాషల్లో ‘ది ప్యారడైజ్’ టార్గెట్ ఏమిటి? సినిమాకు ట్రైలర్ ఉండదని విన్నాము కదా?
‘ది ప్యారడైజ్’ తెలుగు సినిమా. ఇంతకుముందు మా సినిమాలను ఎలా అన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చామో, ఇదీ అలాగే అన్ని భాషల్లో ఉంటుంది. తెలుగు ఆడియన్స్‌కు ‘ది ప్యారడైజ్’ ఎలాంటి అనుభూతిని ఇస్తుందో, ఇతర భాషల ప్రేక్షకులకు కూడా అదే అనుభూతి కలగాలని క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా చేశాం.
శ్రీకాంత్ విజన్‌తో ‘ది ప్యారడైజ్’ చాలా పెద్ద స్కేల్లో థియేటర్లలోకి వస్తుంది.
సినిమాకు మంచి బజ్ ఉంది కాబట్టి ట్రైలర్ ఇవ్వడం లేదనేది కాదు. సినిమా గురించి చాలా టీమ్స్ పనిచేస్తున్నాయి. ట్రైలర్ ఇస్తే అదిరిపోయేలా ఉండాలి. అలాంటి ట్రైలర్ కోసం నాలుగు రోజులు అన్ని పనులను పక్కనపెట్టి శ్రీకాంత్, అనిరుధ్, మిగతా టీమ్ మొత్తం ట్రైలర్‌పై పనిచేయాల్సి ఉంటుంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో టీమ్ అందరం కలిసి ‘ది ప్యారడైజ్’కు ట్రైలర్ ఉండకూడదని నిర్ణయించుకున్నాం.
ప్రీమియర్స్ ఉంటాయి
టికెట్ హైక్స్, ప్రీమియర్స్ ఉంటాయా?
ప్రీమియర్స్ ఉంటాయి. టికెట్ హైక్స్ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలిపారు.
శ్రీకాంత్ మొండితనానికి ఒక పర్పస్ ఉంది
శ్రీకాంత్ మొండితనం వల్లే సినిమా ఆలస్యం అయిందని భావిస్తున్నారా?
కచ్చితంగా. శ్రీకాంత్ మొండివాడు. అయితే తన మొండితనానికి కూడా ఒక పర్పస్ ఉంది. తనకంటూ ఒక విజన్ ఉంది. ఆ విజన్‌ను స్క్రీన్‌పైకి తీసుకురావడంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడు. అందుకే అతని మొండితనం కూడా సినిమా మంచికే పనిచేసింది.
ఈ సినిమాలో చాలా హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇలాంటి యాక్షన్ చేస్తున్నప్పుడు సహజంగానే గాయాలు అవుతాయి. ఈ సినిమాలో నాకే కాదు, మా గ్యాంగ్‌లో నటించిన అందరికీ దెబ్బలు తగిలాయి. ప్రేక్షకులు థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు మేము ఎంత కష్టపడ్డామో వారికి అనుభవమవుతుంది. ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారు.
అనిరుధ్ వల్లే ఆ యుఫోరియా సాధ్యమైంది
యూఎస్ కాన్సర్ట్‌లో ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎలా అనిపించింది?
ఆ యుఫోరియా అనిరుధ్ వల్లే సాధ్యమైంది. నేను కూడా ఆ ఈవెంట్‌ను చాలా ఎంజాయ్ చేశాను. ముఖ్యంగా ‘ఆయా షేర్’ పాటకు వచ్చిన ఎనర్జీ అన్బిలీవబుల్.
మోహన్ బాబు గారితో పనిచేయడం అద్భుతమైన అనుభవం
మోహన్ బాబు గారితో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
మోహన్ బాబు గారు అద్భుతమైన వ్యక్తి. మా మీద ఎంతో ప్రేమ చూపించారు. ఆయనతో కలిసి పనిచేస్తే ఆయనతో ప్రేమలో పడిపోతాం.
ఆ క్యారెక్టర్‌కు అలాంటి వాయిస్ అవసరం
డబ్బింగ్ కోసం చాలా కష్టపడ్డట్టుగా అనిపిస్తోంది. సినిమాలో డైలాగ్స్ కూడా చాలా అగ్రెసివ్‌గా ఉన్నాయి కదా?
ఈ క్యారెక్టర్‌కు అలానే మాట్లాడాలి. ఒక సన్నివేశంలో గొంతు చించుకుని అరవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ప్రతి పదం స్పష్టంగా అర్థం కావాలని లెక్కలు వేసుకుంటే ఆ పాత్ర కనిపించదు. సినిమా చూస్తున్నప్పుడు ఆ డైలాగ్‌ను మరోసారి వినాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ పాత్రలో ఉన్న ఎమోషన్‌తో ప్రతి పదం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.
నిజంగా చెప్పాలంటే ఆ డబ్బింగ్ చెప్పిన తర్వాత నా గొంతు పోయింది. నా కెరీర్లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా కోసం చాలా మనసుపెట్టి పనిచేశాను.
‘ది ప్యారడైజ్’ రన్‌టైమ్ 2 గంటల 49 నిమిషాలు
సినిమా రన్‌టైమ్ ఎంత?
రెండు గంటల 49 నిమిషాలు. ఇదే ఫైనల్ కట్ అని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెలిపారు.
సినిమా మొత్తం హైలెట్‌గా ఉంటుంది
సినిమాలో కాకులకు సంబంధించిన ఎపిసోడ్ చాలా హైలెట్‌గా ఉంటుందని అంటున్నారు.
ఒక్క ఎపిసోడ్ మాత్రమే హైలెట్ అని చెప్పలేను. సినిమా మొత్తం హైలెట్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్ లుక్ విషయంలో ప్రతి అంశాన్ని శ్రీకాంత్ చాలా ప్రత్యేకంగా చూసుకున్నాడు. తనకు ఏం కావాలో చాలా క్లారిటీగా తెలుసు. ఆ విజన్‌ను పర్ఫెక్ట్గా స్క్రీన్‌పైకి తీసుకొచ్చాడు.
‘ది ప్యారడైజ్’ సినిమా కోసం మేమంతా ఎంత కష్టపడ్డామో సెప్టెంబర్ 24న థియేటర్లో ప్రేక్షకులు చూస్తున్నప్పుడు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను” అని నాని తెలిపారు.
