‘Idupu Kayitham’: Srilatha Single Out Now

హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆసక్తికరమైన చిత్రం ‘ఇడుపు కాయితం’. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై నిర్మాత బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ కుటుంబ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం వినోదంతో పాటు భావోద్వేగాలను మేళవించిన ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రానికి సంబంధించిన తొలి పాట ‘శ్రీలత’ తాజాగా విడుదలైంది. చక్కటి మెలోడీతో, తెలంగాణ నేటివిటీకి దగ్గరగా ఉండే సంగీతం, సాహిత్యంతో ఈ పాట ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ప్రియదర్శి, నాగా దుర్గ మధ్య కనిపించే సహజమైన కెమిస్ట్రీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
హైదరాబాద్ సెక్రటేరియట్, ట్యాంక్‌బండ్ వంటి అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన విజువల్స్ పాటకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ప్రేమలోని సహజమైన అనుభూతులను ఆహ్లాదకరంగా ఆవిష్కరించిన ఈ పాట, వినగానే గుర్తుండిపోయే మెలోడీగా నిలుస్తోంది.
సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి ఈ పాటకు ప్రత్యేకమైన టచ్ ఇచ్చారు. పాటను లొకేషన్లోనే రూపొందించే ప్రక్రియను లిరికల్ వీడియోలో చూపించడంతో పాటు, ఆయన కూడా అందులో కనిపించడం ఆసక్తికరంగా మారింది. చిన్నారుల క్యూట్ డ్యాన్స్ సీక్వెన్స్‌లు పాటకు మరింత విజువల్ చార్మ్‌ను తీసుకొచ్చాయి.
అలరాజు రాసిన తెలంగాణ ఫ్లేవర్‌తో కూడిన చిలిపి సాహిత్యం పాటకు చక్కగా సరిపోయింది. శంకర్ బాబు, మోహన భోగరాజు, శీలం పున్నమ్మ, బొల్లెపోగుల సుభద్ర తమ స్వరాలతో ‘శ్రీలత’కు మరింత అందాన్ని తీసుకొచ్చారు.
ప్రియదర్శి, నాగా దుర్గ మధ్య సహజమైన కెమిస్ట్రీతో పాటు వారి గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూవ్స్ కూడా పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రేమికులు, జంటలకు కనెక్ట్ అయ్యేలా ‘శ్రీలత’ను ఆహ్లాదకరమైన ప్రేమగీతంగా రూపొందించారు.
ఇక ‘ఇడుపు కాయితం’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. తెలంగాణ కుటుంబ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ మొదటి వారంలో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
