Dharmasthala Niyojakavargam
‘ధర్మస్థల నియోజకవర్గం’ గొప్ప విజయం సాధిస్తుంది: వి.వి. వినాయక్
సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
హైదరాబాద్: మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాజీవ్ కనకాల, వరుణ్ సందేశ్, వితికా షేరు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మించిన ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
‘ధర్మస్థల నియోజకవర్గం’ గొప్ప సినిమా అవుతుంది: వి.వి. వినాయక్
స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ మాట్లాడుతూ, “చంద్రబోస్ గారు నాకు ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా దర్శకుడు జై జ్ఞాన ప్రభ మంచి సినిమా చేశారని ఆయన చెప్పారు. కథ నచ్చడంతో ఈ చిత్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సంతోషంగా అన్ని పాటలు రాశానని చంద్రబోస్ గారు చెప్పారు.
ఆయన ఈ సినిమా గురించి అంత గొప్పగా చెప్పిన తర్వాత నాకు కూడా సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది. ఈ చిత్రం ఘన విజయం సాధించి దర్శకుడు, నిర్మాత, హీరోతో పాటు మొత్తం చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలి.
నా మొదటి సినిమా ‘ఆది’లో తొలి పాటను చంద్రబోస్ గారే రాశారు. జ్ఞాన ప్రభ గారి తొలి సినిమాకు కూడా చంద్రబోస్ గారే పాటలు రాశారు. ‘ధర్మస్థల నియోజకవర్గం’ కూడా ‘ఆది’ తరహాలో ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

‘రంగస్థలం’ తర్వాత ఈ సినిమాకే అంత సంతృప్తిగా పాటలు రాశాను: చంద్రబోస్
ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ మాట్లాడుతూ, “లిరిక్ రైటర్‌గా నాకు ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని కలిగించిన చిత్రమిది. ‘రంగస్థలం’ తర్వాత అంత సంతోషంగా పాటలు రాసిన సినిమా ఇదే.
ఈ చిత్రంలో అద్భుతమైన, అర్థవంతమైన సాహిత్యాన్ని అందించే ఎన్నో సందర్భాలను దర్శకుడు జ్ఞాన ప్రభ సృష్టించారు. ఐదు పాటలు నాకు ఎంతో సంతృప్తినిచ్చాయి. మహవీర్ వాటికి అద్భుతమైన ట్యూన్స్ అందించారు.
‘న్యాయం చేయరా దేవుడా’, ‘ధర్మో రక్షతి రక్షితః’, ‘ఆరంభం’, ‘కొడుకో కొడుకో’, ‘కాలం’ వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
ప్రతి మనిషిలో ఒక మహా మానవుడు, ఒక అల్ప మానవుడు ఉంటారు. సమాజంలో ఉన్న మహా మానవుడిని మించి మంచిగా ఎదగలేం, అల్ప మానవుడిని మించి దిగజారలేం. ఈ ఇద్దరి మధ్య జరిగే సంఘర్షణే ఈ కథాంశం. ఆ సంఘర్షణలో ఎవరు గెలిచారనేది దర్శకుడు జ్ఞాన ప్రభ అద్భుతంగా తెరకెక్కించారు.
ఈ సినిమా కోసం ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఎంతో ఇష్టంతో, కష్టపడి పనిచేశారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
యువత తప్పక చూడాల్సిన సినిమా: రాజీవ్ కనకాల
నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ, “నిర్మాత భాస్కర్ గారు ‘నాగ’ సినిమా నుంచి నాకు పరిచయం. ఆ పరిచయంతో ఆయన నిర్మిస్తున్న ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చారు.
కొత్త దర్శకులు కథను అద్భుతంగా చెప్పినా, దాన్ని తెరకెక్కించే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. కానీ జ్ఞాన ప్రభ మంచి కథను అంతే అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా ముఖ్యంగా యువత చూడాల్సిన చిత్రం.
డ్రగ్స్ విషయంలో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలను ముందుగానే ఊహించి ఈ అంశాన్ని సినిమాలో చూపించారు. జ్ఞాన ప్రభ మరెన్నో మంచి చిత్రాలు రూపొందించాలి. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను” అన్నారు.
సమాజానికి మంచి సందేశం ఇచ్చే సినిమా: కస్తూరి
నటి కస్తూరి మాట్లాడుతూ, “అన్నమయ్య వంటి ఎన్నో తెలుగు చిత్రాలతో ప్రేక్షకులు నన్ను గుర్తుపెట్టుకున్నారు. ‘గృహలక్ష్మి’ సీరియల్ ద్వారా ప్రతి తెలుగింటికీ చేరువయ్యాను. మరోవైపు తమిళంలో కామెడీ పాత్రలు చేస్తున్నాను.
ఇలాంటి సమయంలో ఈ సినిమాలో నాకు నెగిటివ్ పాత్రను ఇచ్చి దర్శకుడు జ్ఞాన ప్రభ సర్ప్రైజ్ చేశారు. సాధారణంగా కొత్త దర్శకులు తమ తొలి చిత్రంగా లవ్, రొమాంటిక్ సినిమాలు చేయాలని అనుకుంటారు. కానీ సమాజానికి మంచి సందేశాన్ని అందించే ఇలాంటి సినిమా చేసిన జ్ఞాన ప్రభను అభినందిస్తున్నాను.
అలాగే కొత్త దర్శకుడిని నమ్మి ఈ సినిమాను నిర్మించిన నిర్మాత భాస్కర్ గారిని కూడా అభినందిస్తున్నాను” అన్నారు.
సోషల్ మెసేజ్‌తో వస్తున్న మంచి చిత్రం: రాజా రవీంద్ర
నటుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ, “తొలి సినిమాకే మంచి దర్శకుడు, ప్యాషన్ ఉన్న నిర్మాత దొరకడం నటరాజ్ అదృష్టం. సోషల్ మెసేజ్‌తో వస్తున్న మంచి చిత్రమిది.
సినిమా బాగుంటుందని అనిపిస్తోంది. నేను ఇంకా సినిమా చూడలేదు. అయితే కస్తూరి గారు చెప్పిన విషయాలను బట్టి సినిమా చాలా బాగుంటుందని అర్థమవుతోంది. చంద్రబోస్ గారు రాసే పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
కొత్త హీరోకు మంచి సినిమా దొరికింది: సత్యప్రకాష్
నటుడు సత్యప్రకాష్ మాట్లాడుతూ, “ఇలాంటి మంచి సినిమాతో మా అబ్బాయి నటరాజ్ హీరోగా పరిచయం కావడం చాలా సంతోషంగా ఉంది. సోషల్ మెసేజ్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉన్న చిత్రమిది.
ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియగా నిలిచిన దర్శకుడు జ్ఞాన ప్రభ, నిర్మాత భాస్కర్ గారికి ధన్యవాదాలు. నన్ను విలన్‌గా ప్రేక్షకులు గుర్తిస్తారు. కానీ నాకు కూడా పోటీ ఇచ్చేలా ఈ సినిమాలో కస్తూరి గారు విలనిజాన్ని అద్భుతంగా పండించారు.
గొప్ప సాహిత్యాన్ని అందించిన చంద్రబోస్ గారికి అభినందనలు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
పవర్ఫుల్ రోల్ ఇచ్చారు: సాయికుమార్
నటుడు సాయికుమార్ మాట్లాడుతూ, “సత్యప్రకాష్ గారితో ఎన్నో సినిమాల్లో కలిసి నటించాను. ఆయన కుమారుడు నటరాజ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది.
దర్శకుడు జ్ఞాన ప్రభ నాకు ఈ సినిమాలో పవర్ఫుల్ రోల్ ఇచ్చారు. ఈ పాత్రలో నటించడాన్ని ఎంతో ఎంజాయ్ చేశాను. సినిమాలో ఫన్‌తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంది. ముఖ్యంగా నేటి యువతకు చెప్పాల్సిన ఎన్నో విషయాలను ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు” అన్నారు.
ప్రతి పాట కథను ముందుకు తీసుకెళ్తుంది: మహవీర్ ఏలేందర్
మ్యూజిక్ డైరెక్టర్ మహవీర్ ఏలేందర్ మాట్లాడుతూ, “దర్శకుడు జ్ఞాన ప్రభ కథ చెప్పినప్పుడు చాలా ప్రత్యేకంగా అనిపించింది. సినిమాలో ప్రతి పాట కథను ముందుకు తీసుకెళ్లేలా ఉంటుంది.
కథలో అద్భుతమైన సందర్భాలు ఉండటం, వాటికి సంగీతం అందించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. పూర్తి ఎఫర్ట్స్‌తో ఈ సినిమాకు మ్యూజిక్ అందించాను. చంద్రబోస్ గారు అద్భుతమైన సాహిత్యం అందించారు. సినిమాలోని పాటలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమా కూడా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను” అన్నారు.
‘ధర్మస్థల నియోజకవర్గం’ నాకు ఎంతో ప్రత్యేకం: వితికా షేరు
హీరోయిన్ వితికా షేరు మాట్లాడుతూ, “ఇది నాకు ఎంతో మనసుకు దగ్గరైన సినిమా. చాలా గ్యాప్ తర్వాత నేను నటిస్తున్న చిత్రం ఇది.
నిజంగా జరిగిన ఒక ఘటనను నేపథ్యంగా తీసుకుని, ఫిక్షనల్ కథతో సమాజానికి మంచి సందేశాన్ని అందించేలా రూపొందించిన ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. మా దర్శకుడు, నిర్మాత మొదటి రోజు నుంచి ఇప్పటివరకు సినిమాకు వెన్నెముకలా నిలిచారు.
ఈ సినిమా చూసిన తర్వాత దర్శకుడు జ్ఞాన ప్రభ గారిది మొదటి సినిమా అని ప్రేక్షకులు అనుకోరు. అంత అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. సెప్టెంబర్ 4న థియేటర్లలో సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

మంచి సందేశంతో పాటు ఎంటర్టైన్మెంట్: శివకుమార్
నటుడు శివకుమార్ మాట్లాడుతూ, “ఈ సినిమాలో మంచి పాత్ర చేసే అవకాశం నాకు లభించింది. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ మంచి సినిమాలు చేసే భాస్కర్ గారి లాంటి నిర్మాతలు, ఇలాంటి బ్యానర్లు ఉంటే మాలాంటి నటులకు అవకాశాలకు కొదవ ఉండదు.
దర్శకుడు జ్ఞాన ప్రభ మంచి సందేశంతో పాటు ఎంటర్టైన్మెంట్ ఉండేలా సినిమాను తెరకెక్కించారు” అన్నారు.
అనుకున్న సమయానికే సినిమా పూర్తి చేశాం: నిర్మాత మేరుం భాస్కర్
నిర్మాత మేరుం భాస్కర్ మాట్లాడుతూ, “మా సినిమా సెప్టెంబర్ 4న పీవీఆర్, ఐనాక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మా టీమ్ మొత్తం సినిమాకు ఎంతో సహకరించింది.
ఆఫీస్‌లో ఎంతగా చర్చించుకున్నా, షూటింగ్ లొకేషన్‌కు వెళ్లిన తర్వాత మాత్రం ఎంతో క్లారిటీతో పనిచేశాం. దర్శకుడు జ్ఞాన ప్రభ తాను అనుకున్న విధంగా ఒక్క వర్కింగ్ డే కూడా పెరగకుండా సినిమాను పూర్తి చేశారు.
నేను మేనేజర్‌గా చాలా పెద్ద సినిమాలకు పనిచేశాను. ఇప్పుడు నేను నిర్మాతగా చేస్తున్న సినిమాకు జ్ఞాన ప్రభ లాంటి క్లారిటీ ఉన్న దర్శకుడు దొరకడం చాలా సంతోషంగా ఉంది. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది” అన్నారు.
‘ధర్మస్థల నియోజకవర్గం’ ఒక యదార్థ ఘటన స్ఫూర్తితో రూపొందింది: జై జ్ఞాన ప్రభ
దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ, “కథ విన్నప్పటి నుంచి ఇప్పటివరకు పూర్తి సహకారం అందించిన మా నిర్మాత భాస్కర్ గారికి ధన్యవాదాలు. నా టీమ్‌లోని టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ప్రతి ఒక్కరూ నాకు ఎంతో మోరల్ సపోర్ట్‌గా నిలిచారు. వారి సహకారంతోనే ఇలాంటి మంచి సినిమా చేయగలిగాను.
వితికా గారితో పాటు అందరూ ఉదయం ఆరు గంటలకే సెట్లో ఉండేవారు. ఎలాంటి సౌకర్యాలు డిమాండ్ చేయకుండా సినిమాకు పనిచేశారు. ఇలాంటి టీమ్ దొరకడం నా అదృష్టం.
ఒక యదార్థ ఘటనను నేపథ్యంగా తీసుకుని ఫిక్షనల్ స్టోరీతో ఈ సినిమాను రూపొందించాం. మంచి మెసేజ్, ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. సెప్టెంబర్ 4న థియేటర్లలో సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
‘కామన్ మ్యాన్’ కోసం ‘కామన్ మ్యాన్’ కథ: నటరాజ్
హీరో నటరాజ్ మాట్లాడుతూ, “ ‘ధర్మస్థల నియోజకవర్గం’ లాంటి మంచి సినిమాతో హీరోగా పరిచయం అవుతుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకు మా దర్శకుడు జై జ్ఞాన ప్రభ, నిర్మాత భాస్కర్ గారు ఫిల్లర్స్‌లా నిలిచారు.
చంద్రబోస్ గారు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. మహవీర్ తన పేరులో ఉన్నంత పవర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నా కోస్టార్స్ అందరికీ ధన్యవాదాలు.
ఇది ఒక కామన్ మ్యాన్ కోసం, ఒక కామన్ మ్యాన్ కథతో రూపొందించిన సినిమా. సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
‘ధర్మస్థల నియోజకవర్గం’ సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.
