TNIT South Indian Media Awards Is a Great Initiative: Actor Ali
TNIT South Indian Media Awards Is a Great Initiative: Actor Ali
మీడియా రంగంలోని ప్రతిభావంతులను గుర్తించి సన్మానించడం అభినందనీయం
హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘TNIT సౌత్ ఇండియన్ మీడియా అవార్డ్స్ 2026’ ప్రెస్ మీట్లో సినీ ప్రముఖులు, సీనియర్ జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలోని మీడియా రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న జర్నలిస్టులు, మీడియా సంస్థలు, ఫోటోగ్రాఫర్లు, డిజిటల్ క్రియేటర్లను గుర్తించి సత్కరించడమే ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
యాక్టర్ అలీ మాట్లాడుతూ, నటులు, దర్శకులు, టెక్నీషియన్లు తదితర సినీ రంగ ప్రముఖులకు అనేక అవార్డులు లభిస్తున్నప్పటికీ, వారిని ప్రజలకు పరిచయం చేసి హైలైట్ చేసే జర్నలిస్టులను గుర్తించి అవార్డులు ఇవ్వాలనే ఆలోచన అభినందనీయమన్నారు. రఘు భట్‌కు ఇలాంటి ఆలోచన రావడం ఆనందంగా ఉందన్నారు. జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లతో పాటు మీడియా రంగంలోని వారికి హెల్త్ కార్డు అందిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని, అందుకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 23న బెంగళూరులో జరగనున్న అవార్డుల వేడుకకు శుభాకాంక్షలు తెలిపారు.
దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ, సినీ పరిశ్రమలోని కళాకారులను ప్రోత్సహించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. మీడియా లేకపోతే కళాకారులకు తగిన గుర్తింపు లభించదని పేర్కొన్నారు. అలాంటి మీడియా ప్రతినిధులను ‘TNIT సౌత్ ఇండియన్ మీడియా అవార్డ్స్’ ద్వారా సత్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది ఇదే స్థాయిలో నిర్వహించాలని ఆకాంక్షించారు.
నిర్మాత రామ్ సత్యనారాయణ మాట్లాడుతూ, కెమెరా వెనుక పనిచేసే మీడియా ప్రతినిధులను కూడా గుర్తించి అవార్డులు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. పరిశ్రమకు మీడియా ఎంతో అవసరమని, మీడియా సేవలను గుర్తించి సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. నాలుగు భాషలను కలుపుతూ అవార్డులు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
రఘు భట్ మాట్లాడుతూ, అక్టోబర్ 23న బెంగళూరులో ‘TNIT సౌత్ ఇండియన్ మీడియా అవార్డ్స్ 2026’ వేడుకను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మీడియాలోని అన్ని విభాగాలకు చెందిన ప్రతిభావంతులకు అవార్డులు అందజేస్తామని చెప్పారు. సినిమా, పొలిటికల్ బ్యూరో, మెట్రో, కెమెరా, ప్రింట్ మీడియా తదితర విభాగాలకు అవార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. నామినీలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ, ఈ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. నాలుగు రాష్ట్రాల నుంచి జర్నలిస్టులను ఆహ్వానించి, వారికి అద్భుతమైన వసతులు కల్పించి గౌరవించడం అభినందనీయమన్నారు. కార్యక్రమ నిర్వహణ విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుందని తెలిపారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మీడియా రంగంలో నిజాయితీగా, నిరంతరాయంగా సేవలందిస్తున్న జర్నలిస్టులు, మీడియా సంస్థలు, ఫోటోగ్రాఫర్లు, డిజిటల్ క్రియేటర్లు తదితరులను ఒకే వేదికపై సత్కరించడమే ‘TNIT సౌత్ ఇండియన్ మీడియా అవార్డ్స్ 2026’ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
