‘Mahendragiri Varahi’ Will Deliver a Grand Theatrical Experience Sumanth
‘మహేంద్రగిరి వారాహి’ గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది: సుమంత్
సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో పాటు ఇతర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అంచనాలను పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా హీరో సుమంత్ మీడియాతో ముచ్చటించారు. సినిమా విశేషాలతో పాటు తన పాత్ర, సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టర్, మైథాలజీ అంశాలు, యాక్షన్, మ్యూజిక్ తదితర విషయాలను ఆయన పంచుకున్నారు.
‘మహేంద్రగిరి వారాహి’ ప్రమోషన్స్ చాలా జోరుగా చేస్తున్నారు కదా?
అవునండి. ఈ మధ్యకాలంలో నా నుంచి వస్తున్న చాలా బిగ్ బడ్జెట్ సినిమా ఇది. నిర్మాతలు చాలా పెద్ద స్కేల్లో సినిమాను నిర్మించారు. అదే స్థాయిలో ప్రమోషన్స్ కూడా చాలా అగ్రెసివ్‌గా చేస్తున్నారు. హిందీ, తమిళ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. నార్త్‌లో కూడా సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆ రెస్పాన్స్ చూస్తుంటే సినిమాపై మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. మేమంతా ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘చిన్న మనవడు, పెద్ద మనవడు’ అంటూ మీరు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దాని గురించి?
అది అఖిల్ గురించి సరదాగా అన్నాను. తనను ‘అయ్యగారు’ అని పిలుస్తుంటారట. ఇక అందరి మనవళ్లలో నేనే పెద్దవాడిని. కాబట్టి ‘నేను పెద్దవాడిని, అయ్యగారు అంటే బాగుంటుంది కదా’ అనే ఉద్దేశంతో సరదాగా అన్నాను. అంతకుమించి దాని వెనుక ఎలాంటి సీరియస్ విషయం లేదు.
‘మహేంద్రగిరి వారాహి’ కథ విన్నప్పుడు మీకు ఏ అంశం బాగా కనెక్ట్ అయింది?
కథ మొత్తం నాకు చాలా నచ్చింది. ముఖ్యంగా ఇంటర్వెల్, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆడియన్స్‌కు మంచి హై ఇస్తాయి.
దర్శకుడు సంతోష్ ఈ కథను నాకు సింగిల్ సిట్టింగ్‌లోనే చెప్పారు. అప్పుడే నాకు చాలా నచ్చింది. వేదాలు, పురాణాలపై సంతోష్‌కు మంచి అవగాహన ఉంది. ఈ సబ్జెక్ట్ ఆయనకు చాలా రైట్‌గా అనిపించింది. తను అనుకున్న కథను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు.
మేము మొదట అనుకున్నప్పుడు సినిమా ఇంత బిగ్ స్కేల్లో తయారవుతుందని ఊహించలేదు. కానీ VFX, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, నటీనటుల ఎంపిక.. ఇలా అన్నీ సినిమాకు చాలా బాగా కలిసి వచ్చాయి.
ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
ఈ సినిమాలో నేను యూట్యూబ్‌లో మూఢ నమ్మకాలను ఎక్స్పోజ్ చేసే క్యారెక్టర్లో కనిపిస్తాను. అయితే నా పాత్ర గురించి ఇప్పుడే ఎక్కువగా చెప్పకూడదు. సినిమాలో ఆ పాత్రకు సంబంధించిన చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి.
ఇది కేవలం డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మాత్రమే కాదు. ఇందులో మంచి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది. అదే సమయంలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అన్ని అంశాలను బ్యాలెన్స్ చేస్తూ సినిమాను తెరకెక్కించారు.

సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
సిద్దు ఇందులో చాలా సీరియస్ క్యారెక్టర్ చేశాడు. మా ఇద్దరి మధ్య ఒక ప్రత్యేకమైన సీన్ ఉంటుంది. అది సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. ఆ సీన్ చూసిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పారు.
ఆ పాత్ర సినిమాకు చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. ఇలాంటి పాత్రను ఒప్పుకుని చేసినందుకు సిద్దుకు థాంక్స్ చెప్పాలి.
ప్రస్తుతం మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఆ ట్రెండ్‌లో భాగంగానే ఈ సినిమా చేశారా?
లేదండి. ‘కార్తికేయ’, ‘కాంతార’ వంటి సినిమాల తర్వాత మైథాలజీకి సంబంధించిన కథలపై మళ్లీ ఆసక్తి పెరిగింది. అంతకు ముందు కూడా ఇలాంటి సినిమాలు వచ్చాయి. కాకపోతే ఈ చిత్రాల తర్వాత వరుసగా అలాంటి సినిమాలు రావడం ప్రారంభమైంది.
కానీ మా సినిమా విషయానికి వస్తే, మేము ఈ కథను దాదాపు మూడేళ్ల క్రితమే ఫిక్స్ చేశాం. అప్పటికి సరైన నిర్మాతలు దొరకలేదు. ఒక సంవత్సరం తర్వాత మధు గారు ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఆ తర్వాత లక్ష్మణ్ గారు వచ్చారు.
లక్ష్మణ్ గారు మా సినిమా ఫుటేజ్ చూసి నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఆయన దిల్ రాజు గారితో చాలా సినిమాలు చేశారు. అలాంటి అనుభవం ఉన్న నిర్మాత మా సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా అనిపించింది.
మీరు ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటారు. మీకు ఎలాంటి పాత్రలు చేయడం ఎక్కువగా ఇష్టం?
నాకు అన్ని రకాల పాత్రలు చేయడం ఇష్టమే. ఒకే తరహా పాత్రలకు పరిమితం కావాలని ఎప్పుడూ అనుకోను. వైవిధ్యమైన కథలు, విభిన్నమైన పాత్రలు చేయడానికి ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాను.
ట్రైలర్ చూస్తే ‘మురారి’ సినిమా ఛాయలు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు?
ట్రైలర్లో చూపించినట్టుగా 33 ఏళ్లు దాటితే ఆ వంశంలో వ్యక్తులు చనిపోతున్నారనే పాయింట్ ‘మురారి’ సినిమాను గుర్తు చేయవచ్చు. కానీ అది ఒక పాయింట్ మాత్రమే.
‘మహేంద్రగిరి వారాహి’ కథ, స్క్రీన్‌ప్లే పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇది కంప్లీట్‌గా డిఫరెంట్ సబ్జెక్ట్. సినిమా చూస్తే ఆ విషయం ప్రేక్షకులకు అర్థమవుతుంది.
అనూప్ రూబెన్స్ సంగీతం గురించి చెప్పండి?
అనూప్ రూబెన్స్ గారి రీ-రికార్డింగ్ సినిమాకు ఒక పెద్ద హైలెట్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూస్బంప్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
సినిమాలో మ్యూజిక్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. థియేటర్లో ఆడియన్స్‌కు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్. పవన్ కళ్యాణ్ గారు వారాహి మాల వేసుకోవడం, వారాహి యాత్ర చేయడంతో ఈ పేరు మరింత పాపులర్ అయింది. అది మీ సినిమా టైటిల్‌కు ఎలా హెల్ప్ అయింది?
మేము కథ అనుకున్నప్పుడే ‘మహేంద్రగిరి వారాహి’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేశాం. పవన్ కళ్యాణ్ గారికి వారాహి పాజిటివ్‌గా హెల్ప్ అయింది. కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీ మా సినిమాకు కూడా కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాం.
సినిమాలో యాక్షన్ ఎలా ఉంటుంది?
సినిమాలో మూడు ప్రధాన యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. వాటితో పాటు చాలా యాక్షన్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. యాక్షన్ నాకు ఎప్పటి నుంచో ఇష్టం. గతంలో కూడా చాలా యాక్షన్ సినిమాలు చేశాను.
మంచి యాక్షన్ కథ, పాత్ర వస్తే తప్పకుండా చేస్తాను. ఈ సినిమాలో యాక్షన్‌కు కథతో మంచి కనెక్షన్ ఉంటుంది.

మీరు విలన్ పాత్రలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారని గతంలో చెప్పారు. నిజమేనా?
నేను ఎప్పటినుంచో విలన్ పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. హీరోగా సినిమాలు చేయడంతో పాటు మంచి విలన్ క్యారెక్టర్స్, బలమైన సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను.
పాత్ర బాగుండాలి, కథలో దానికి ప్రాధాన్యత ఉండాలి. అలాంటి క్యారెక్టర్ వస్తే తప్పకుండా చేస్తాను.
‘న్యూటన్ థర్డ్ లా’, ‘మహేంద్రగిరి వారాహి’.. మీ నుంచి వరుసగా సినిమాలు వస్తున్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా ఫైనల్ అయ్యాయా?
కొన్ని కథలు విన్నాను. అయితే ఇప్పటివరకు ఏ సినిమాను ఫైనల్ చేయలేదు. మంచి కథ, మంచి పాత్ర వస్తే తప్పకుండా చేస్తాను.
