Attahaasam First Look Sparks Curiosity
‘అట్టహాసం’ టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల.. ఆసక్తి రేపుతున్న వెంకటేష్ మహా కొత్త సినిమా
‘C/O కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
బ్లాక్‌బస్టర్ చిత్రం కను నిర్మించిన శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ తాజాగా మరో ఆసక్తికరమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. మహాయాన బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్నారు. C/O కంచరపాలెం వంటి సూపర్‌హిట్ చిత్రంతో తనదైన ముద్ర వేసుకున్న వెంకటేష్ మహా ఈసారి ‘అట్టహాసం’ అనే విభిన్నమైన కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
చింత వరలక్ష్మి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చింత గోపాలకృష్ణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి చింత నిర్మిస్తున్నారు. చింత వినీషా రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
వెంకటేష్ మహాతో పాటు కార్తీక్ రత్నం, పవని కరణం, శ్రావంతి పీపకాయల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.
‘అట్టహాసం’ అనే టైటిల్‌కు తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆసక్తికరంగా రూపొందించారు. పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్స్, అందులో కనిపిస్తున్న పాత్రల తీరు, వారు ఎదుర్కొనే పరిస్థితులపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. అయితే కథకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించకుండా పోస్టర్ ద్వారా మరింత క్యూరియాసిటీని పెంచారు మేకర్స్.
నిజ జీవితానికి దగ్గరగా, సహజత్వంతో కూడిన కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. రియల్, రూటెడ్ అండ్ ఆథెంటిక్ ఎంటర్టైనర్గా ‘అట్టహాసం’ రూపొందుతోందని మేకర్స్ పేర్కొన్నారు.
వెంకటేష్ మహా గత చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా విభిన్నమైన కథనం, సహజమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా C/O కంచరపాలెం తర్వాత వెంకటేష్ మహా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కావడంతో అంచనాలు ఏర్పడుతున్నాయి.
వచ్చే ఏడాది సమ్మర్లో ‘అట్టహాసం’ను థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
