Journalist Prabhu Celebrates 40 Years in Film Journalism
ఘనంగా జర్నలిస్ట్ ప్రభు 40 ఏళ్ల సినీ ప్రస్థానం
‘శూన్యం నుండి శిఖరాగ్రాలకు – పార్ట్ 2’ తొలి ప్రతిని రూ.5 లక్షలకు కొనుగోలు చేసిన నిర్మాత ఆదిత్య రామ్.. దుర్గా మాధవి ప్రభు ఛారిటబుల్ ట్రస్ట్‌కు రూ.11,11,111 విరాళం ప్రకటించిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా పాత్రికేయుడిగా తనదైన ముద్ర వేసుకున్న జర్నలిస్ట్ ప్రభు పుట్టినరోజు వేడుకలు, ఆయన 40 ఏళ్ల సినీ పాత్రికేయ ప్రస్థాన వేడుకలు హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్సీసీ)లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, పాత్రికేయ మిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొని ప్రభుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వేడుకల్లో భాగంగా ప్రభు రచించిన, గద్దర్ అవార్డును అందుకున్న ‘శూన్యం నుండి శిఖరాగ్రాలకు – పార్ట్ 2’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అలాగే, స్వర్గీయ ఆడెపు దుర్గా మాధవి జ్ఞాపకార్థం ఆమె పేరుతో ఆడెపు దుర్గా మాధవి ప్రభు ఛారిటబుల్ ట్రస్ట్‌ను ప్రారంభించారు. తన సతీమణి సేవా గుణాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో ప్రభు ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి దర్శకులు ఎస్.వి. కృష్ణారెడ్డి, రేలంగి నరసింహారావు, నిర్మాతలు అచ్చిరెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, చదలవాడ శ్రీనివాసరావు, ఆదిత్య రామ్, కాట్రగడ్డ ప్రసాద్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నటులు సుమన్, జేడీ చక్రవర్తి, ఉత్తేజ్, కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితరులు హాజరయ్యారు. సినీ పరిశ్రమ ప్రముఖులు, మీడియా మిత్రులు, ప్రభు కుటుంబ సభ్యులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.
రూ.5 లక్షలకు పుస్తకం తొలి ప్రతిని కొనుగోలు చేసిన ఆదిత్య రామ్
ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంఘటన ‘శూన్యం నుండి శిఖరాగ్రాలకు – పార్ట్ 2’ పుస్తక తొలి ప్రతిని నిర్మాత ఆదిత్య రామ్ రూ.5 లక్షలకు కొనుగోలు చేయడం. చెన్నైకి చెందిన ఆదిత్య రామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఆదిత్య రామ్ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు.
కార్యక్రమ వ్యాఖ్యాత నాగేంద్రకుమార్ పుస్తకం తొలి ప్రతిని రూ.లక్షకు కొనుగోలు చేయాలని కోరగా, ఆదిత్య రామ్ స్పందిస్తూ రూ.లక్ష కాదు.. రూ.5 లక్షలకు కొనుగోలు చేస్తానని ప్రకటించారు. దీంతో సభలో ఉన్నవారంతా హర్షం వ్యక్తం చేశారు.

ఛారిటబుల్ ట్రస్ట్‌కు రూ.11,11,111 విరాళం
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆడెపు దుర్గా మాధవి ప్రభు ఛారిటబుల్ ట్రస్ట్‌కు రూ.11,11,111 విరాళాన్ని ప్రకటించారు. అవసరంలో ఉన్నవారికి ఈ మొత్తాన్ని నిర్మాత ప్రసన్నకుమార్ ద్వారా అందజేస్తానని తెలిపారు. ప్రభు జర్నలిస్టుగా ఎంత ప్రతిభావంతుడో, వ్యక్తిత్వంలోనూ అంత గొప్పవారని చదలవాడ ప్రశంసించారు. ఆయన ఎంతోమందికి సహాయం చేశారని పేర్కొంటూ, ప్రభు శతజయంతి వేడుకలను కూడా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ప్రభు జర్నలిజం పట్ల ఉన్న అభిరుచి అభినందనీయం: ఆదిత్య రామ్
నిర్మాత ఆదిత్య రామ్ మాట్లాడుతూ, ప్రభుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘శూన్యం నుండి శిఖరాగ్రాలకు – పార్ట్ 2’ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పుస్తక పరిమాణం, అందులోని సమాచారం చూస్తే సినిమా జర్నలిజం పట్ల ప్రభుకు ఉన్న ఆసక్తి, అభిరుచి ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుందని చెప్పారు. ఇందులోని సమాచారాన్ని మూడు పుస్తకాలుగా ప్రచురించవచ్చని అభిప్రాయపడ్డారు. పుస్తకం తొలి ప్రతిని రూ.5 లక్షలకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటిస్తూ, ప్రభు మరెన్నో సంవత్సరాలు ఇదే ఉత్సాహంతో జర్నలిజంలో కొనసాగాలని ఆకాంక్షించారు.
సినీ పాత్రికేయుల్లో ప్రభు ప్రత్యేకం: అచ్చిరెడ్డి
నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ, సినీ పాత్రికేయుల్లో ప్రభు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. ప్రజలకు ఎలాంటి సమాచారం అందించాలో అటువంటి సమాచారాన్ని అందిస్తూ అందరి ప్రశంసలు పొందారని తెలిపారు. ప్రభు మరెన్నో సంవత్సరాలు చిత్ర పరిశ్రమతో కలిసి తన ప్రయాణాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.
ప్రభుతో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి: సుమన్
నటుడు సుమన్ మాట్లాడుతూ, ప్రభుపై తనకు ప్రత్యేకమైన గౌరవం, అభిమానం ఉన్నాయని తెలిపారు. గత 40 ఏళ్లలో ఆయనతో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. ప్రభు తన ప్రయాణాన్ని మరింత విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగపడేలా రాయాలనుకున్నా: ప్రభు
జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ, 1986లో ప్రారంభమైన తన సినీ పాత్రికేయ ప్రస్థానం 2026 నాటికి 40 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు. తన కెరీర్లో ఈ సందర్భాన్ని ఎంతో గొప్ప మైలురాయిగా భావిస్తున్నానని చెప్పారు.
ఈ నాలుగు దశాబ్దాల ప్రయాణంలో చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతోమంది ప్రముఖులతో పరిచయాలు, అనుబంధాలు ఏర్పడటం, వారి ప్రేమాభిమానాలు, ప్రశంసలు పొందడం తన అదృష్టమని పేర్కొన్నారు.

పాత్రికేయుడిగా తాను రాసే ప్రతి అంశం చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో పనిచేశానని ప్రభు తెలిపారు. ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదని, వృత్తిపరమైన విలువలు, నైతికతకు ప్రాధాన్యత ఇస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించానని చెప్పారు. తనను స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది కొత్తవారు జర్నలిజంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు.
తన జీవితంలో దాసరి నారాయణరావు, నిర్మాత వడ్డే రమేష్‌లను ఎప్పటికీ మర్చిపోలేనని ప్రభు భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు.
తన స్వర్గీయ సతీమణి దుర్గా మాధవి సేవా గుణాన్ని కొనసాగించాలనే సంకల్పంతో ఆడెపు దుర్గా మాధవి ప్రభు ఛారిటబుల్ ట్రస్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
పుట్టినరోజు వేడుకలతో పాటు 40 ఏళ్ల సినీ పాత్రికేయ ప్రస్థానాన్ని ఘనంగా గుర్తుచేసుకున్న ఈ కార్యక్రమం, పుస్తకావిష్కరణతోనూ, సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతోనూ ప్రత్యేకతను సంతరించుకుంది. సినీ పరిశ్రమ, మీడియా రంగాల మధ్య ప్రభుకు ఉన్న సుదీర్ఘ అనుబంధానికి ఈ వేడుక ఒక గుర్తుండిపోయే సందర్భంగా నిలిచింది.
