Mass Seemantham Ceremony for 2,000 Pregnant Women Held Under Jubilee Hills MLA Naveen Yadav’s Leadership
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2,000 మంది గర్భిణులకు సామూహిక శ్రీమంతం
అంగరంగ వైభవంగా సామూహిక శ్రీమంతం, అన్నప్రాసన కార్యక్రమాలు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోషకాహార వారోత్సవాలను పురస్కరించుకుని నవయువ నిర్మాణ్ సంస్థ, కాంగ్రెస్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతం, అన్నప్రాసన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. యూసుఫ్‌గూడలోని మహమ్మద్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సుమారు 2,000 మంది గర్భిణీ మహిళలు, చిన్నారులు హాజరయ్యారు. కాబోయే తల్లులకు ఆరోగ్యం, ఆనందం, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పుట్టింటి కానుకగా చీర-సారెతో పాటు పసుపు, కుంకుమ అందజేసి సామూహికంగా శ్రీమంతం నిర్వహించారు.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలకు అండగా నిలుస్తూ, వారిని సొంత కుటుంబ సభ్యులుగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ‘అన్న’ అనే మాటను సార్థకం చేస్తూ ఆడపడుచులకు అండగా నిలిచారని పలువురు కొనియాడారు.
అదేవిధంగా చిన్నారులు తొలిసారిగా అన్నం రుచి చూసే మధురమైన ఘట్టమైన అన్నప్రాసన కార్యక్రమాన్ని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షురాలు గద్వాల విజయలక్ష్మి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ కలిసి నిర్వహించారు. చిన్నారులను ఆశీర్వదించి, వారి భవిష్యత్తు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, అజారుద్దీన్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షురాలు గద్వాల విజయలక్ష్మి, మైనార్టీ నాయకుడు ఫాహీం ఖురేషి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, MLC అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ఉత్తమ్ పద్మావతి రెడ్డి, చిత్తం పర్ణిక రెడ్డి, యశస్విని రెడ్డి, తెలంగాణ సోషల్ మీడియా ప్రెసిడెంట్ సామ రామ్మోహన్ రెడ్డి, గద్దర్ వెన్నెల, కాల్వ సుజాత, కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి, దీపక్ జాన్, సరిత తిరుపతయ్య, చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొనడంతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది. మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

