karthi
‘సర్దార్ 2’ కాన్సెప్ట్ పదిరెట్ల ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది: కార్తి
తమిళ, తెలుగు భాషల్లో ఘన విజయం సాధించిన ‘సర్దార్’కు సీక్వెల్‌గా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ **‘సర్దార్ 2’**తో హీరో కార్తి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తోంది.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. భారీ స్థాయిలో యాక్షన్, ఆసక్తికరమైన స్పై థ్రిల్లర్ అంశాలతో రూపొందిన ‘సర్దార్ 2’ సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో కార్తి మీడియాతో ముచ్చటించి సినిమా విశేషాలను పంచుకున్నారు.
‘సర్దార్’ కంటే ‘సర్దార్ 2’ పదిరెట్ల ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది
‘‘ఇండియాలో స్పై సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. అలాంటి సినిమాలు తీయడం కూడా అంత సులభం కాదు. స్పై అంటే మనకు టామ్ క్రూజ్ లాంటి హీరోలు గుర్తుకొస్తారు. కానీ ‘సర్దార్’ కథను మిత్రన్ నాకు చెబుతూ.. లుంగీ వేసుకున్న గూఢచారి అని చెప్పగానే ఆ పాత్రతో వెంటనే కనెక్ట్ అయ్యాను.
గూఢచారులు మన మధ్యే సాధారణ వ్యక్తుల్లా జీవిస్తూ తమ అసలు గుర్తింపును బయటకు తెలియనివ్వరు. రవీంద్ర కౌశిక్ వంటి నిజ జీవిత గూఢచారుల కథలు కూడా మనకు తెలుసు. అలాంటి అంశాలను మిత్రన్ కథలో అద్భుతంగా జోడించారు. ఆ కథ నాకు చాలా నచ్చింది.
‘సర్దార్’లో వాటర్ కాన్సెప్ట్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. నీరే మన జీవితం. చరిత్రలో కూడా యుద్ధాల సమయంలో ఒక దేశానికి మరో దేశానికి నీటి సరఫరాను నిలిపివేయడం వంటి వ్యూహాలు ఉండేవి. ఆ కాన్సెప్ట్ ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది. ‘సర్దార్ 2’ కాన్సెప్ట్ దానికి పదిరెట్ల ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా చాలా లార్జర్ స్కేల్లో ఉంటుంది’’ అని కార్తి తెలిపారు.
దేశం కోసం పోరాడే గూఢచారి కథ
‘‘‘విక్రమ్’ వంటి సినిమాల్లో వ్యక్తిగత పోరాటం కనిపిస్తుంది. కానీ ‘సర్దార్’లో ఒక గూఢచారి సమాజం కోసం చేసే పోరాటం ఉంటుంది. నీటిని కమర్షియల్‌గా మార్చకూడదనే ఉద్దేశంతో అతను పోరాడతాడు. దేశం కోసం ఒక వ్యక్తి తన జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని త్యాగం చేయడం సాధారణ విషయం కాదు. ఆ పాత్రలో చాలా లేయర్స్ ఉన్నాయి.
‘సర్దార్’ ఎందుకు తిరిగి రావాలి? అనే ప్రశ్నకు అద్భుతమైన సమాధానంతో మిత్రన్ సీక్వెల్ కథను రూపొందించారు. అలాగే ఇందులో ఒక కొత్త విలన్ క్యారెక్టర్‌ను కూడా డిజైన్ చేశారు. ఆ పాత్రను ఎస్.జే. సూర్య చేస్తున్నారు. ప్రస్తుతానికి ‘సర్దార్ 2’ కాన్సెప్ట్ గురించి ఎక్కువగా చెప్పలేను’’ అని కార్తి అన్నారు.

మైండ్ బ్లోయింగ్‌గా యాక్షన్ సీక్వెన్సులు
‘‘ఇటీవల మనకు స్పై యూనివర్స్‌లో ‘దురంధర్’ వంటి సినిమాలు వచ్చాయి. అయితే దాని కాన్సెప్ట్ వేరు. ‘సర్దార్ 2’ కాన్సెప్ట్ పరంగా, విజువల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది. సౌత్‌లో కూడా ఇంత భారీ స్థాయిలో స్పై సినిమా చేయగలమని చెప్పేలా ఈ సినిమా ఉంటుంది.
స్పైలకు సాధారణంగా ఫ్యామిలీ లైఫ్ ఉండదు. వారు చేసే త్యాగాలకు కూడా గుర్తింపు ఉండదు. ఎందుకంటే వారి పని గురించి ఎవరికీ తెలియకూడదు. చాలా స్పై సినిమాల్లో ఆపరేషన్స్ దేశం బయట జరుగుతుంటాయి. కానీ ‘సర్దార్ 2’లో ఇండియాలో జరుగుతున్న ఒక సమస్యను గూఢచారి ఎలా పరిష్కరించాడు అనేది చూపించాం.
ఈ సినిమాను చాలా లార్జ్ స్కేల్లో తెరకెక్కించాం. మొదటి నుంచి చివరి వరకు అద్భుతమైన యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి’’ అని కార్తి తెలిపారు.
ఫాదర్, సన్ పాత్రలు చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది
‘‘ఈ సినిమాలో తండ్రి, కొడుకు పాత్రలు కలిసి ట్రావెల్ చేస్తాయి. రెండు పాత్రలను ఒకేసారి పోషించడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. మేకప్ విషయంలో కూడా చాలా ఓపిక అవసరమైంది.
నాకు యాక్షన్ అంటే చాలా ఇష్టం. అయితే ఇందులో ఒక ప్రత్యేకమైన ఛాలెంజ్ ఉంది. ఒక వృద్ధుడిలా ఫైట్స్ చేయాలి. వయసు మీద పడినా ఆ పాత్ర చాలా స్కిల్డ్‌గా ఉంటుంది. గూఢచారి కావడంతో అతని దగ్గర ఎన్నో ఫైటింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ యాక్షన్ సీక్వెన్సులను చాలా ఎంజాయ్ చేశాను’’ అని కార్తి చెప్పారు.
హీరోయిన్ల పాత్రల్లో కొత్త డైమెన్షన్
‘‘ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ఆశిక రంగనాథన్, మాళవిక మోహనన్ తమ పాత్రల్లో చాలా కొత్త డైమెన్షన్ తీసుకొస్తారు. వారి పాత్రలు రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్స్‌కు భిన్నంగా, చాలా ఇంటెలిజెంట్‌గా ఉంటాయి. మహిళలు ఎంత బలంగా ఉంటారు, దేశం కోసం వారు ఎలా పోరాడగలరు అనేది సినిమాలో చూపించాం’’ అని కార్తి వెల్లడించారు.
ఎస్.జే. సూర్య పాత్ర చాలా కొత్తగా ఉంటుంది
‘‘ఎస్.జే. సూర్య గారి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు ఆ పాత్రను చాలా ఎంజాయ్ చేస్తారు. ‘స్పైడర్’లో ఏది మిస్ అయిందో.. ‘సర్దార్ 2’లో అది వర్కౌట్ అయిందని సూర్య గారు చెప్పారు. తన పాత్రకు ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పారు’’ అని కార్తి తెలిపారు.
వందే భారత్ ట్రైన్ కోసం భారీ సెట్
‘‘‘సర్దార్ 2’ హై వాల్యూ ప్రొడక్షన్‌తో తెరకెక్కిన సినిమా. ఈ చిత్రం కోసం మొత్తం వందే భారత్ ట్రైన్ సెట్‌ను నిర్మించారు. ఇలాంటి ప్రయత్నం ఇంతకుముందు ఎవరూ చేయలేదు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా భారీగా ఖర్చు చేశారు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సినిమాను చాలా గ్రాండ్‌గా తెరకెక్కించారు’’ అని కార్తి చెప్పారు.
‘సర్దార్’ ప్రభావం పిల్లల వరకు వెళ్లడం ఆనందంగా అనిపించింది
‘సర్దార్’ తర్వాత తనకు ఎదురైన ఓ ఆసక్తికరమైన సంఘటనను కార్తి గుర్తు చేసుకున్నారు.
‘‘‘సర్దార్’ రిలీజ్ తర్వాత ఒకసారి షూటింగ్‌కి వెళ్తున్నాను. ముగ్గురు కుర్రాళ్లు నా కారు వెనుక వచ్చి ‘వాటర్ బాటిల్ ప్లాంట్స్‌ని మేము రానివ్వము’ అని గట్టిగా అరిచారు. అది చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. సినిమా చిన్న పిల్లల వరకు కూడా చేరడం చాలా సంతోషంగా అనిపించింది’’ అని కార్తి తెలిపారు.

నాగార్జున అన్నయ్యతో మంచి అనుబంధం
తెలుగులో ‘సర్దార్ 2’ను అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తుండటంపై కార్తి మాట్లాడుతూ, ‘‘మంచి సినిమా ఉన్నప్పుడు నేను కాన్ఫిడెంట్‌గా ఉంటాను. నాగార్జున అన్నయ్య ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్‌గా ఉంటాను. ఆయనతో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఆయన ఎప్పుడూ నా గురించి మాట్లాడేటప్పుడు తమ్ముడు అనే సంబోధిస్తారు.
సినిమాకు ఏం కావాలో అన్నపూర్ణ స్టూడియోస్ వారు అద్భుతంగా చేస్తారు. ‘సర్దార్’ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా విడుదలైంది. ఇప్పుడు ‘సర్దార్ 2’ కూడా వారి ద్వారా విడుదల కావడం చాలా హ్యాపీగా ఉంది’’ అని అన్నారు.
పీఎస్ మిత్రన్ అద్భుతమైన స్కిల్ ఉన్న దర్శకుడు
దర్శకుడు పీఎస్ మిత్రన్ గురించి కార్తి మాట్లాడుతూ, ‘‘మిత్రన్ చాలా అద్భుతమైన స్కిల్ ఉన్న దర్శకుడు. ప్రేక్షకులకు ఏం కావాలో అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా కాన్సెప్ట్స్‌ను డిజైన్ చేస్తారు. ‘సర్దార్ 1’తో పోలిస్తే ఇప్పుడు ఆయనలో మరింత పరిణితి వచ్చింది’’ అని ప్రశంసించారు.
‘హిట్ 4’, ‘మార్షల్’తో పాటు మరో ఎంటర్టైనర్
తన తదుపరి చిత్రాల గురించి కార్తి మాట్లాడుతూ, ‘‘శైలేష్ గారితో ‘హిట్ 4’ చేస్తున్నాను. కళ్యాణ్ శంకర్ గారితో ఒక మంచి ఎంటర్టైనర్ చేస్తున్నాను. ఇది చాలా ఫన్‌గా ఉంటుంది. ఇలాంటి సినిమా చేసి చాలా రోజులైంది. ‘మార్షల్’ సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తయింది’’ అని తెలిపారు.
సూర్యతో కలిసి సినిమా చేయాలని మాకూ ఉంది
తన అన్న సూర్యతో కలిసి సినిమా చేయాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విషయం గురించి కార్తి స్పందిస్తూ, ‘‘మాకు కూడా కలిసి సినిమా చేయాలనే ఉంది. అయితే అలాంటి కథ, సరైన దర్శకుడు కుదరాలి. మేము కూడా అలాంటి మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు.
‘సర్దార్ 2’ సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
