Jayanth and the Gingopen
టీచర్స్ డే సందర్భంగా ఘనంగా ‘జయంత్ అండ్ ది జింగోపెన్’ ఫస్ట్ లుక్ విడుదల
నమో జయం ప్రొడక్షన్స్ పతాకంపై నేషనల్ అవార్డు విజేత నవీన్ దేశబోయిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జయంత్ అండ్ ది జింగోపెన్’. జయంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి తాత పాత్రలో, సత్యం రాజేష్ స్కూల్ టీచర్‌గా కనిపించనున్నారు. దివ్య ప్రవీణ్ బొలిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
టీచర్స్ డే సందర్భంగా ‘జయంత్ అండ్ ది జింగోపెన్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జాతీయ అవార్డు అందుకున్న ఉపాధ్యాయురాలు మారం పవిత్ర చేతుల మీదుగా ఘనంగా విడుదల చేశారు. విద్య, పాఠశాల వాతావరణం, విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను ప్రధానాంశాలుగా తీసుకుని రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.
ఈ సందర్భంగా హీరో జయంత్ మాట్లాడుతూ, “ఇదొక కొత్త తరహా చిత్రం. మనం ప్రతిరోజూ పాఠశాలలో ఎదుర్కొనే సమస్యలతో పాటు, విద్యా వ్యవస్థలోని పలు అంశాలను మా సినిమాలో చూపించాం. ప్రేక్షకులకు ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది” అన్నారు.

దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ, “ఈ సినిమా చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. నా గత చిత్రం ‘లతా భగవాన్ ఖరే’ దేశవ్యాప్తంగా 32 అవార్డులను అందుకుంది. ఫిలింఫేర్‌తో పాటు నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు జయంత్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘జయంత్ అండ్ ది జింగోపెన్’ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. ఇది మలయాళంలో విజయవంతమైన ‘ఫిలిప్ అండ్ ది మంకీ పెన్’ చిత్రానికి రీమేక్. ఆ చిత్రం మలయాళంలో 111 రోజులు ప్రదర్శితమై ఘన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా అందులోని ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదే తరహాలో తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మా చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నాను” అన్నారు.
సత్యం రాజేష్ మాట్లాడుతూ, “టీచర్స్ డే రోజున నేను టీచర్‌గా నటించిన సినిమా ఫస్ట్ లుక్‌ను జాతీయ అవార్డు అందుకున్న ఉపాధ్యాయురాలు మారం పవిత్ర గారి చేతుల మీదుగా విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు.

నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ, “నా ఉద్దేశంలో స్కూల్ ఒక దేవాలయం, టీచర్లు దేవుళ్లతో సమానం. అందుకే మా సినిమా ఓపెనింగ్‌ను కూడా ఇక్కడే నిర్వహించాం. ఇప్పుడు మా సినిమా ఫస్ట్ లుక్ ప్రమోషన్‌ను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా నాకు, నా భర్త ప్రవీణ్‌కు ఎంతో గర్వకారణం” అన్నారు.
కుటుంబ భావోద్వేగాలతో పాటు విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలను ప్రతిబింబించేలా తెరకెక్కుతున్న ‘జయంత్ అండ్ ది జింగోపెన్’ చిత్రంపై ఫస్ట్ లుక్ విడుదలతో మరింత ఆసక్తి పెరిగింది.
ఈ చిత్రానికి సంగీతం: మోహిత్ కులకర్ణి, ఎడిటర్: నందమూరి హరి తారక రామారావు, కెమెరా: ఆండ్రూబాబు, ట్యూన్స్ అండ్ లిరిక్స్, మాటలు: ప్రవీణ్ బొలిశెట్టి, ఆర్ట్ డైరెక్టర్: నాని. ఈ చిత్రంలో ఆశిష్ గాంధీ, కాశీ విశ్వనాథ్, తనికెళ్ల భరణి, మానస రాధాకృష్ణన్ తదితరులు నటిస్తున్నారు.
