Comrade Kalyan
‘కామ్రేడ్ కళ్యాణ్’ వెరైటీ ఫన్ రైడ్‌లా ఉంటుంది.. ప్రేక్షకులు సరదాగా ఎంజాయ్ చేస్తారు: హీరో శ్రీ విష్ణు
ఘనంగా శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ లాంచ్.. అక్టోబర్ 9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కామ్రేడ్ కళ్యాణ్’. పీరియడ్ ఎలిమెంట్స్, హ్యూమర్, రొమాన్స్, ఎమోషన్ కలగలిపిన ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతోంది. జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలకు మంచి స్పందన లభించగా.. తాజాగా చిత్ర బృందం టీజర్‌ను ఘనంగా విడుదల చేసింది. టీజర్ లాంచ్ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
1992 నేపథ్యంలో సాగనున్న కథ
‘కామ్రేడ్ కళ్యాణ్’ కథ 1992లో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది. ఇందులో శ్రీ విష్ణు థియేటర్ ఓనర్‌గా కనిపించనున్నారు. విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్. నారాయణమూర్తికి వీరాభిమానిగా ఉండే కళ్యాణ్.. ఆయన సినిమాలనే తన థియేటర్లో ఎక్కువగా ప్రదర్శిస్తుంటాడు.
ఎలాంటి సమస్యలు లేకుండా సరదాగా సాగిపోతున్న కళ్యాణ్ జీవితంలోకి ఓ ఒడియా అమ్మాయి ప్రవేశిస్తుంది. ఆమెతో ప్రేమలో పడిన తర్వాత అతని జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. చివరకు అతడిని నక్సలిజం వైపు నడిపించే పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయన్నదే సినిమాలో ఆసక్తికరమైన అంశంగా కనిపిస్తోంది.
సీరియస్ బ్యాక్‌డ్రాప్ ఉన్న కథను దర్శకుడు జనకిరామ్ మారెళ్ల పూర్తిగా సీరియస్‌గా కాకుండా హ్యూమర్, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్‌తో కూడిన లైట్‌హార్టెడ్ ట్రీట్మెంట్తో తెరకెక్కించినట్లు టీజర్ స్పష్టం చేస్తోంది. నక్సలిజం నేపథ్యానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు మినహా టీజర్ మొత్తం సరదాగా, వినోదాత్మకంగా సాగింది. ముఖ్యంగా కామెడీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తోంది.
కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న శ్రీ విష్ణు
శ్రీ విష్ణు మరోసారి తనదైన ఈజీ స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. థియేటర్ ఓనర్‌గా, ఆర్. నారాయణమూర్తి అభిమానిగా ఆయన పాత్రలో మంచి హ్యూమర్ కనిపిస్తోంది. ముఖ్యంగా సత్య, సుదర్శన్‌లతో శ్రీ విష్ణు కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు టీజర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఒడియా అమ్మాయి పాత్రలో మహిమా నంబియార్ ఆకట్టుకోగా, రాధికా శరత్‌కుమార్ తన పాత్రలో మంచి కన్విక్షన్‌తో కనిపించారు. షైన్ టామ్ చాకో సీరియస్ అవతార్‌లో కనిపించగా, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రలో మెప్పించారు.
విజువల్స్, మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణ
సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని గ్రామీణ వాతావరణాన్ని, ప్రకృతి అందాలను అద్భుతంగా చిత్రీకరించారు. పచ్చని అడవులు, సహజమైన పరిసరాలు సినిమాకు మంచి విజువల్ రిచ్‌నెస్‌ను తీసుకొచ్చాయి.
విజయ్ బుల్గానిన్ సంగీతం సినిమాకు ఉన్న కామెడీ, ఎంటర్టైన్మెంట్ టోన్‌కు చక్కగా సరిపోవడంతో పాటు.. నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో అడవుల్లో సాగే సన్నివేశాల్లో టెన్షన్‌ను కూడా క్రియేట్ చేసింది. ఛోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా రిచ్‌గా కనిపిస్తున్నాయి.
టీజర్‌లోని హ్యూమర్‌తో పాటు కళ్యాణ్ పాత్రలో చోటుచేసుకునే మార్పు సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఎలాంటి టెన్షన్ లేకుండా సరదాగా జీవించే కళ్యాణ్‌ను చివరకు విప్లవం వైపు నడిపించిన పరిస్థితులు ఏమిటన్న ప్రశ్నను టీజర్ ప్రేక్షకుల ముందుంచింది.
“సినిమా అంతా సరదా సరదాగా ఉంటుంది” – శ్రీ విష్ణు
టీజర్ లాంచ్ కార్యక్రమంలో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. కామ్రేడ్ అంటే స్నేహితుడు. కళ్యాణ్ అంటే శుభం. ఎప్పుడూ పక్కవాళ్ల శుభం కోరుకునే స్నేహితుడు. సినిమా అంతా సరదా సరదాగా ఉంటుంది. ఇలాంటి మంచి కథను తీసుకొచ్చిన కోన వెంకట్ గారికి థాంక్యూ. అలాగే భాను నందు చాలా అద్భుతంగా రాశారు. దర్శకుడు జానకిరామ్‌కి చాలా పెద్ద సూపర్ హిట్ రావాలని కోరుకుంటున్నాను.
మనం మంచి సినిమా చేసినప్పుడు, అందులో విలువ ఉన్నప్పుడు ప్రేక్షకులు మనకు విజయాన్ని అందిస్తారు. మా శివ గారికి, బాబీ గారికి, అందరికీ థాంక్యూ. ఈ వేడుకకు నారాయణమూర్తి గారు, విజయేంద్ర ప్రసాద్ గారు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది.
ఫస్ట్ హాఫ్ అంతా సినిమా చాలా సరదాగా ఉంటుంది. నెమ్మదిగా కథలోకి వెళ్లాక సత్య గారు వస్తారు. జానకిరామ్ సత్య గారిని చాలా కొత్తగా చూపించారు. సినిమాలో చాలా వెరైటీ ఫన్ ఉంటుంది. మీ అందరికీ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది” అని అన్నారు.
విజయేంద్ర ప్రసాద్: ‘శ్రీ విష్ణుకి ఆల్ ది బెస్ట్’
రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “కామ్రేడ్‌ని విడగొడితే ‘కామ్ రెడీ’. నిశ్శబ్దంగా ఉండే రాజు.. మెల్లగా వచ్చి హృదయాలను దోచే రాజు. శ్రీ విష్ణు గారి సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని ఎవరు అన్నారు? నేను అనుకోలేదు. ఎందుకంటే ఎంత సాధించినా అది ‘బాహుబలి’ కంటే ఒకటి రెండు కోట్లు తక్కువే ఉండాలి” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
శ్రీ విష్ణుకి ఆల్ ది బెస్ట్ చెప్పిన ఆయన.. ఆర్. నారాయణమూర్తి, కోన వెంకట్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.
ఆర్. నారాయణమూర్తి: కొత్త దర్శకులకు శ్రీ విష్ణు అవకాశాలు ఇవ్వడం గొప్ప విషయం
ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ.. “మాకు ఇంత ఘన స్వాగతం పలికిన చిత్ర బృందానికి అభినందనలు. కొత్త దర్శకులకు శ్రీ విష్ణు అవకాశాలు ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. ఒక రైజింగ్ హీరో కొత్త దర్శకులకు తన డోర్స్ తెరిచి అవకాశాలు ఇవ్వడం ఎంతోమంది దర్శకులకు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసే వారిని కామ్రేడ్స్ అంటారు. అయితే ‘కామ్రేడ్’ అనే పదంపై సెన్సార్ అభ్యంతరం తెలిపిందని విన్నాను. సెన్సార్ ఇబ్బంది పెట్టడం ధర్మం కాదు. సినిమా అనేది ఎంతోమంది శ్రమతో కూడుకున్న పరిశ్రమ. దయచేసి ఆ పరిశ్రమను ఇబ్బంది పెట్టకండి. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ. దాన్ని అడ్డుకోవద్దని నా విజ్ఞప్తి.
టీజర్ చూస్తుంటే మంచి వినోదం, ప్రేమ కనిపిస్తున్నాయి. జానకిరామ్ చాలా అద్భుతంగా సినిమాను తీశాడు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
బాబీ: ‘కచ్చితంగా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుంది’
దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. “కోన వెంకట్ గారు నాకు గాడ్‌ఫాదర్. ఆయన నుంచే పరిశ్రమలో ఎలా నడవాలో నేర్చుకున్నాను. ఈ కథ నేను విన్నాను. కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుతుంది. జానకిరామ్ చాలా కాన్ఫిడెంట్ డైరెక్టర్.
కోన గారు అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుని చేస్తారు. శ్రీ విష్ణు గారు రవితేజ గారి లాగా కొత్త దర్శకులందరికీ అవకాశాలు ఇస్తుంటారు. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్‌బస్టర్ కాబోతోంది” అన్నారు.
శివ నిర్వాణ: ప్రేక్షకులు సినిమాను రిపీట్‌గా చూడాలి
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. “కోన గారు ‘నిన్ను కోరి’తో నన్ను డైరెక్టర్ని చేశారు. కోన వెంకట్ గారి టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. శ్రీ విష్ణు గారితో నాకు ‘సోలో’ సినిమా నుంచి ట్రావెల్ ఉంది. నేను ఇంట్లో శ్రీ విష్ణు గారి సినిమాలే ఎక్కువగా చూస్తుంటాను. ఈ సినిమాను కూడా ప్రేక్షకులు రిపీట్‌గా చూడాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నందిని రెడ్డి: కోన అన్న ఫంక్షన్ అంటేనే సెలబ్రేషన్
దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ.. “కోన అన్న ఫంక్షన్ అంటేనే ఒక సెలబ్రేషన్‌లా ఉంటుంది. శ్రీ విష్ణు ఆన్‌స్క్రీన్ కామెడీ టైమింగ్ కంటే ఆఫ్‌స్క్రీన్ కామెడీ టైమింగ్ ఇంకా బాగుంటుంది. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
బీవీఎస్ రవి: జానకిరామ్ చాలా కాన్ఫిడెంట్‌గా తీశారు
బీవీఎస్ రవి మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నేను చిన్న క్యారెక్టర్ చేశాను. జానకిరామ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఈ సినిమా తీశాడు. చాలా పెద్ద సినిమా అవుతుంది. శ్రీ విష్ణు గారి సినిమాలను మనమందరం చూస్తాం. తప్పకుండా ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది” అన్నారు.
వీఎన్ ఆదిత్య: సినిమా పరిశ్రమను అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదు
దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. “కోన వెంకట్ గారు ఏది చేసినా ఒక సెలబ్రేషన్‌లా చేస్తారు. ఈ వేడుకకు ఇంతమంది గెస్టులు రావడం చాలా సంతోషంగా ఉంది. టీమ్ అందరికీ కంగ్రాట్యులేషన్స్. గత మూడు నెలలుగా సినిమాలు అద్భుతంగా ఆడుతున్నాయి. అయితే సెన్సార్ నుంచి కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి. సినిమాను అనవసరంగా సెన్సార్ ఇబ్బందులకు గురి చేయకూడదనేది నా విజ్ఞప్తి” అన్నారు.
జానకిరామ్: శ్రీ విష్ణు లాంటి హీరో దొరకడం నా అదృష్టం
దర్శకుడు జానకిరామ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. శ్రీ విష్ణు గారు నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. నా తొలి సినిమాకు శ్రీ విష్ణు గారి లాంటి హీరో దొరకడం నా అదృష్టం. కోన వెంకట్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే కృష్ణ గారికి ధన్యవాదాలు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అక్టోబర్ 9న అందరం థియేటర్లో కలుద్దాం” అన్నారు.
కోన వెంకట్: శ్రీ విష్ణు కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా
నిర్మాత, సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ.. “కామ్రేడ్ అంటే మన కష్టంలో, నష్టంలో చేయి వదలకుండా చివరి వరకు మనతో ఉండే వాళ్లని కామ్రేడ్స్ అంటారు. ఈ వేడుకకు వచ్చిన మీరందరూ కూడా నా కామ్రేడ్స్.
శ్రీ విష్ణు ప్రతి సినిమాతో పది మెట్లు పైకి ఎక్కుతున్నాడు. తన సక్సెస్ రేట్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో ఈ సినిమాను తీశాం. అది నేను గర్వంగా చెబుతున్నాను.
నారాయణమూర్తి గారు ఈ వేడుకకు పర్ఫెక్ట్ గెస్ట్. విజయేంద్ర ప్రసాద్ గారు నా గురువు. ఆయన ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. మరో రెండేళ్లలో శ్రీ విష్ణును తెలుగు ప్రేక్షకులు చాలా పెద్ద స్థాయిలో చూడబోతున్నారు. మరోసారి అందరికీ ధన్యవాదాలు” అన్నారు.
వెంకట కృష్ణ: భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా
నిర్మాత వెంకట కృష్ణ మాట్లాడుతూ.. “ఇది నా తొలి సినిమా. ఈ సినిమాను చాలా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాం. ప్రొడక్ట్ చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఈ వేడుకకు విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు. అందరూ ఈ సినిమాను ఆశీర్వదించి, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.
చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్న ఈ టీజర్ లాంచ్ వేడుక ఉత్సాహభరితంగా సాగింది. ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
