Mana Panel Scores Big in TFPC Elections 2026
టీఎఫ్‌పీసీ ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ ఘన విజయం
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) 2026 ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ ఘన విజయం సాధించింది. పలు కీలక పదవులతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీలోనూ ‘మన ప్యానెల్’కు చెందిన అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు.
‘మన ప్యానెల్’కు చెందిన సి. కల్యాణ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చాదలవాడ శ్రీనివాసరావు ట్రెజరర్‌గా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్ పదవులకు ‘మన ప్యానెల్’ నుంచి మోహన్ వడ్లపట్ల, ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి దామోదర ప్రసాద్ విజయం సాధించారు.
జాయింట్ సెక్రటరీలుగా ‘మన ప్యానెల్’కు చెందిన అమ్మిరాజు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఎన్నికయ్యారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీకి ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి మైత్రి రవి, నిరంజన్ రెడ్డి, డి.ఎస్. రావు ఎన్నికయ్యారు. ‘మన ప్యానెల్’ నుంచి పద్మిని, ఏషియన్ సునీల్, మోహన్ గౌడ్, శివలెంక కృష్ణ ప్రసాద్, దానయ్య, వంశీ నందిపాటి, పల్లి కేశవరావు, శ్రీనివాసరావు, పుల్లారావు, బాపిరాజు, ఆర్.కె. గౌడ్, నయీమ్ విజయం సాధించారు.
అయితే సెక్రటరీ పదవికి సంబంధించిన ఎన్నికల ఫలితాన్ని మాత్రం ప్రస్తుతానికి వెల్లడించలేదు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉండటంతో ఎన్నికల అధికారి దుర్గాప్రసాద్ ఫలితాన్ని కవర్లో సీల్ చేసి కోర్టుకు సమర్పించనున్నారు. సెప్టెంబర్ 8న న్యాయమూర్తి సమక్షంలో ఆ కవర్‌ను తెరిచి సెక్రటరీ పదవి ఫలితాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
నిర్మాతల సంక్షేమమే ప్రధాన లక్ష్యం: సి. కల్యాణ్
విజయం అనంతరం అధ్యక్షుడిగా ఎన్నికైన సి. కల్యాణ్ మీడియా ప్రతినిధులకు, తమ ప్యానెల్‌కు మద్దతుగా నిలిచిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
“మొదటగా మాకు మద్దతుగా నిలిచిన మీడియా సభ్యులందరికీ ధన్యవాదాలు. దూర ప్రాంతాల నుంచి వచ్చి మాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మా ప్యానెల్‌కు 95 శాతం మెజారిటీతో విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు.
పరిశ్రమకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే మేమంతా ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా నిర్మాతల సంక్షేమం కోసం పనిచేస్తాం. ఇతర పరిశ్రమలతో పోలిస్తే తెలుగు చిత్ర పరిశ్రమ మంచి స్థాయిలో ఉంది. అందరూ మాకు సహకరించాలని కోరుతున్నాం.
త్వరలోనే ప్రెస్‌మీట్ నిర్వహించి మా కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తాం. చిన్న నిర్మాతలకు అండగా నిలిచి, వారికి సాధ్యమైనంత సహాయం అందిస్తాం. మా విజయానికి మద్దతుగా నిలిచిన బండ్ల గణేష్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు,” అని సి. కల్యాణ్ తెలిపారు.
అనంతరం విజయం సాధించిన అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలను ప్రకటించి, ఎన్నికైన సభ్యులను అభినందించారు. సెక్రటరీ పదవి ఫలితాన్ని మాత్రం కోర్టు ప్రక్రియ అనంతరం అధికారికంగా ప్రకటించనున్నారు.
చిన్న నిర్మాతలకు అండగా ఉంటాం: చాదలవాడ శ్రీనివాసరావు
ట్రెజరర్‌గా ఎన్నికైన చాదలవాడ శ్రీనివాసరావు తమ ప్యానెల్‌కు బలమైన మెజారిటీ అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
“మాకు మంచి మెజారిటీ ఇచ్చిన ఓటర్లందరికీ ధన్యవాదాలు. మా విజయానికి మద్దతుగా నిలిచిన నందమూరి కుటుంబానికి, సునీల్ నారంగ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
మా ప్యానెల్లో ఎంతో అనుభవం ఉన్న సభ్యులు ఉన్నారు. వారి అనుభవాన్ని ఉపయోగించుకుని తెలుగు చిత్ర పరిశ్రమను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తాం. చిన్న నిర్మాతలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం,” అని ఆయన అన్నారు.
పరిశ్రమకు మంచి చేసే వారే గెలిచారు: తుమ్మల ప్రసన్న కుమార్
తుమ్మల ప్రసన్న కుమార్ మీడియాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులందరికీ అభినందనలు తెలిపారు.
“మాకు మద్దతుగా నిలిచిన మీడియా సభ్యులందరికీ ధన్యవాదాలు. విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. పరిశ్రమకు మంచి చేయగలిగే వ్యక్తులు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. నిర్మాతల కౌన్సిల్ ఎన్నికల్లో బలమైన, సమర్థవంతమైన వ్యక్తులు గెలవడం చాలా గొప్ప విషయం,” అని ఆయన అన్నారు.
‘మన ప్యానెల్’కు లభించిన ఈ ఘన విజయంతో కొత్త కార్యవర్గంపై నిర్మాతల్లో అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా చిన్న నిర్మాతల సమస్యలు, నిర్మాతల సంక్షేమం, పరిశ్రమ అభివృద్ధి దిశగా కొత్త కమిటీ ఎలాంటి చర్యలు చేపడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
