Epic-Movie-Review
EPIC మూవీ రివ్యూ: రిలేషన్షిప్ డ్రామాకు కొత్త టచ్
Namaste Telugu Rating : 3/5 Release Date : September 11, 2026
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆదిత్య హాసన్
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
ఛాయాగ్రహణం: అజీమ్ మొహమ్మద్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సినిమా దేని గురించి?
‘EPIC – FIRST SEMESTER’ కథ యూకేలో చదువుకుంటున్న ఇద్దరు యువతీ యువకుల చుట్టూ తిరుగుతుంది. మొదట సాధారణ పరిచయంగా మొదలయ్యే వీరి బంధం క్రమంగా రిలేషన్‌షిప్‌గా మారుతుంది. ఆ తర్వాత ఇద్దరూ లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లడంతో వారి మధ్య భావోద్వేగపరమైన సమస్యలు మొదలవుతాయి.
ఈ బంధం వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపింది? చివరకు వీరిద్దరూ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? అనేదే సినిమా ప్రధాన కథాంశం.
నటీనటుల పెర్ఫార్మెన్స్
ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో అమాయకంగా, కొంత బెరుకుగా, టెన్షన్ పడుతూ, ఏం చేయాలో అర్థంకాని యువకుడి పాత్రలో కనిపిస్తాడు. ప్రారంభంలో ఆయన బాడీ లాంగ్వేజ్ కొంత నెర్వస్‌గా అనిపించినప్పటికీ, కథ ముందుకు వెళ్లే కొద్దీ ఆ పాత్ర స్వభావానికి అది సరిగ్గా సరిపోతుందని అర్థమవుతుంది.
కన్ఫ్యూజ్డ్, ఇన్నోసెంట్, వల్నరబుల్ యువకుడిగా ఆనంద్ తన పాత్రకు న్యాయం చేశాడు. పాత్రలో పెద్దగా ఎలివేషన్ లేకపోయినా, తన పరిధిలో మంచి నటనను కనబరిచాడు.
వైష్ణవి చైతన్యకు నటనకు పెద్దగా స్కోప్ ఉన్న పాత్ర దక్కలేదు. పాత్రలో కొత్తదనం, బలమైన ఎమోషనల్ లేయర్స్ పెద్దగా కనిపించవు. తన పాత్రకు అవసరమైన మేరకు వైష్ణవి చక్కగా నటించింది.
విశ్లేషణ
‘EPIC – FIRST SEMESTER’కు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. గతంలో ‘90’s’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఈసారి పూర్తిగా భిన్నమైన రిలేషన్షిప్ డ్రామాను తెరకెక్కించారు.
సినిమా ప్రారంభం ‘90’s’ ప్రపంచాన్ని గుర్తు చేసేలా ఉంటుంది. అదే ఇంటి వాతావరణం, పరిచయమైన కుటుంబ సభ్యులు, ఇప్పుడు పెరిగిన చిన్న కొడుకు పాత్రలో ఆనంద్ దేవరకొండ కనిపించడం మంచి నాస్టాల్జిక్ ఫీల్‌ను ఇస్తుంది. ఈ ప్రారంభ సన్నివేశాలు ఆహ్లాదకరంగా సాగుతాయి.
అయితే కథ యూకేకు షిఫ్ట్ అయిన తర్వాత సినిమా పూర్తిగా మరో ట్రాక్‌లోకి వెళ్తుంది. ఇక్కడే ప్రధాన సమస్య మొదలవుతుంది.
లీడ్ పెయిర్ రిలేషన్‌షిప్‌ను బిల్డ్ చేసిన విధానం అంతగా ఆకట్టుకోదు. ఇద్దరూ యూకేలో చదువుకుంటున్న విద్యార్థులుగా చూపించినప్పటికీ, వారి స్టూడెంట్ లైఫ్‌కు సంబంధించిన రిలేటబుల్ అంశాలు పెద్దగా కనిపించవు. ఎక్కువ భాగం కథ ఒక గదిలోనే సంభాషణలు, కిస్సింగ్, ఇంటిమేట్ సీన్ల చుట్టూ తిరుగుతుంది.
ఇది సాధారణ ప్రేమకథ కంటే రిలేషన్షిప్ డ్రామాగా తెరకెక్కించే ప్రయత్నం. ఆ ఆలోచనలో కొత్తదనం ఉన్నప్పటికీ, హీరో, హీరోయిన్ పాత్రలను ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా బలంగా రాసుకోలేకపోయారు.
హీరో అమాయకంగా, భయపడుతూ ఉండే వ్యక్తిగా, హీరోయిన్ మాత్రం కొంత బోల్డ్‌గా కనిపిస్తుంది. ఈ ఇద్దరి భిన్నమైన వ్యక్తిత్వాల మధ్య మంచి డ్రామాను క్రియేట్ చేసే అవకాశం ఉంది. కానీ ఆ కాన్ఫ్లిక్ట్ను దర్శకుడు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేదు.
వీరి మధ్య రిలేషన్షిప్ కూడా చాలా త్వరగా ముందుకు సాగుతుంది. కిస్ నుంచి ఇంటిమేట్ సీన్ల వరకు ప్రయాణం కనిపించినా, దాని వెనుక ఉన్న ఎమోషనల్ కనెక్షన్ అంత బలంగా అనిపించదు. దీంతో వారి బంధంపై ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో ఆసక్తి కలగడం కష్టం.
ఫస్ట్ హాఫ్‌లో అక్కడక్కడా కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ‘సాంప్రదాయిని’ ఎపిసోడ్‌కు ఇచ్చిన కాల్‌బ్యాక్ సరదాగా అనిపిస్తుంది. అయితే ఇలాంటి సన్నివేశాలు చాలా తక్కువగా ఉండటంతో మొత్తం ఫస్ట్ హాఫ్‌ను అవి నిలబెట్టలేకపోతాయి.
ఇంటర్వెల్ సమయానికి మరో ఇంటిమేట్ సీన్‌తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.
సెకండాఫ్‌లో హీరోయిన్ ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు కనిపిస్తుంది. దానికి కారణంగా PCOD, పీరియడ్స్‌కు సంబంధించిన ఆరోగ్య సమస్యలను సినిమా ప్రస్తావిస్తుంది. మహిళలు ఎదుర్కొనే శారీరక, భావోద్వేగ ఇబ్బందులను చూపించే ప్రయత్నం చేయడం అభినందనీయం.
అయితే ఈ అంశాన్ని మరింత సున్నితంగా, సహజంగా చూపించాల్సిన అవసరం ఉంది. కొన్ని సన్నివేశాలను దర్శకుడు అతిగా ఎమోషనల్‌గా చూపించడంతో అసలు ఉద్దేశం కొంత డైల్యూట్ అవుతుంది.
హీరోయిన్ పీరియడ్స్‌లో ఉందని తెలుసుకున్న హీరో ఆమెను కలవడానికి చెప్పులు లేకుండా పరుగెత్తుకుంటూ వెళ్లే సన్నివేశం కూడా కొంత ఓవర్‌గా అనిపిస్తుంది. ఇలాంటి సన్నివేశాల్లో సహజత్వం కంటే అతిశయోక్తి ఎక్కువగా కనిపిస్తుంది.
ఆ తర్వాత ప్రెగ్నెన్సీ స్కేర్ చుట్టూ కథ తిరుగుతుంది. ఈ ఎపిసోడ్ కూడా పెద్దగా ఆసక్తిని రేకెత్తించదు. అక్కడి నుంచి సినిమా నెమ్మదించి, చివరకు బ్రేకప్ డ్రామా వైపు వెళ్తుంది.
అప్పటికే హీరో, హీరోయిన్ రిలేషన్‌షిప్‌తో ప్రేక్షకులకు పెద్దగా ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడకపోవడంతో బ్రేకప్ సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపవు.
యూకే బ్యాక్‌డ్రాప్ కూడా పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేదనే భావన కలుగుతుంది. యూకేలో చదువుకుంటున్న విద్యార్థుల కథగా చెప్పినప్పటికీ, వారి స్టూడెంట్ లైఫ్, అక్కడి అనుభవాలు, పరిసరాలు కథలో పెద్దగా కనిపించవు. ఎక్కువ భాగం కథ ఒకే గదిలో జరుగుతుంది. అందువల్ల ఈ కథను యూకేలోనే తీయాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న కూడా కలుగుతుంది.
క్లైమాక్స్‌కు ముందు తల్లిదండ్రుల ఎమోషన్‌ను తీసుకురావడం ద్వారా సినిమాకు భావోద్వేగ బలం చేకూర్చే ప్రయత్నం చేశారు. హీరో తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కొడుకును డబ్బులు అడగడం, కొడుకు బాధపడి డబ్బులు పంపించడం వంటి సన్నివేశాలు ఉన్నాయి.
అయితే ఈ ట్రాక్ కూడా ప్రేక్షకుడిని బలంగా కదిలించలేకపోతుంది. హీరో యూకేలో ఏం చేస్తున్నాడనే అంశం కంటే హీరోయిన్‌తో రిలేషన్‌షిప్‌పైనే సినిమా ఎక్కువగా దృష్టి పెట్టడంతో ఈ ఫ్యామిలీ ట్రాక్ కొంత అకస్మాత్తుగా వచ్చినట్లు అనిపిస్తుంది.
చివరికి సెకండాఫ్‌లోని స్లో పేస్ తర్వాత వచ్చే క్లైమాక్స్ కూడా పూర్తిస్థాయిలో సంతృప్తిని ఇవ్వదు. కథకు సరైన ఎమోషనల్ క్లోజర్ లభించలేదనే భావన కలుగుతుంది.
మొత్తంగా ‘EPIC – FIRST SEMESTER’లో మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ, బలమైన క్యారెక్టరైజేషన్, సహజమైన రిలేషన్షిప్ డెవలప్మెంట్, ఆసక్తికరమైన కాన్ఫ్లిక్ట్ లేకపోవడం ప్రధాన లోపాలుగా మారాయి.
‘90’s’లో కనిపించిన వెచ్చదనం, నాస్టాల్జియా, సహజమైన ఎమోషన్స్ ఇక్కడ కనిపించవు. ఈసారి ఆదిత్య హాసన్ ఎంచుకున్న రిలేషన్షిప్ డ్రామా ప్రేక్షకులతో ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాలేకపోయింది.
ఇతర నటీనటులు
సినిమాలో సపోర్టింగ్ క్యాస్ట్‌కు పెద్దగా స్కోప్ లేదు.
‘MAD’ దర్శకుడు కళ్యాణ్ శంకర్ హీరో ఫ్రెండ్‌గా కనిపిస్తాడు. అయితే ఆయన పాత్ర పెద్దగా గుర్తుండిపోయే విధంగా లేదు.
యూకేలో మరో ఫ్రెండ్ పాత్రలో గవిరెడ్డి శ్రీనివాస్ కనిపిస్తారు. ఆయన పాత్ర కూడా పరిమితంగానే ఉంటుంది.
‘90’s’లో తల్లిదండ్రులుగా కనిపించిన శివాజీ, వాసుకి ఆనంద్ ఈ సినిమాలో కూడా కనిపిస్తారు. వీరి ఎంట్రీ కొంత నాస్టాల్జియాను కలిగించినప్పటికీ, కథలో వారి పాత్రలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.
సంగీతం, ఇతర విభాగాలు
హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. ‘సంచారమే’ పాట ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకుంది. అయితే మిగిలిన పాటలు అంతగా గుర్తుండిపోయేలా లేవు.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాల్లో బాగానే పనిచేసింది. ఓ సిట్యుయేషనల్ సాంగ్ కూడా కథకు కొంత సపోర్ట్ ఇస్తుంది. మొత్తంగా సంగీతం మిక్స్డ్ బ్యాగ్.
అజీమ్ మొహమ్మద్ కెమెరా పనితనం ఓకే. యూకే బ్యాక్‌డ్రాప్ ఉన్నప్పటికీ సినిమా ఎక్కువగా ఇండోర్ లొకేషన్స్‌లోనే సాగడంతో విజువల్‌గా పెద్దగా ఇంప్రెస్ చేసే అంశాలు కనిపించవు.
నవీన్ నూలి ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లోని స్లో సీన్లను ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత ఎంగేజింగ్‌గా ఉండేది.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ విలువలు సినిమా కథ, స్కేల్‌కు తగ్గట్టుగా ఉన్నాయి.
తీర్పు
‘EPIC – FIRST SEMESTER’ ఆధునిక రిలేషన్‌షిప్‌ను, యువత జీవితంలోని కొన్ని సున్నితమైన అంశాలను టచ్ చేసే ప్రయత్నం చేసింది. కాన్సెప్ట్‌లో కొత్తదనం ఉన్నప్పటికీ, బలమైన క్యారెక్టరైజేషన్ లేకపోవడం, రిలేషన్షిప్ సరిగా ఎస్టాబ్లిష్ కాకపోవడం, సెకండాఫ్‌లో నెమ్మదించడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం సినిమాకు మైనస్‌గా మారాయి.
‘90’s’తో ఆకట్టుకున్న ఆదిత్య హాసన్ ఈసారి పూర్తిగా భిన్నమైన జానర్‌ను ఎంచుకున్నప్పటికీ, అదే స్థాయి ఎమోషనల్ కనెక్షన్‌ను మాత్రం సాధించలేకపోయారు.
మొత్తంగా: మంచి కాన్సెప్ట్ ఉన్నా, పూర్తి స్థాయిలో కనెక్ట్ చేయలేని రిలేషన్షిప్ డ్రామా.
