Sampoornesh Babu
‘ది ప్యారడైజ్’లో నా బిర్యానీ క్యారెక్టర్ చాలా సీరియస్‌గా ఉంటుంది: సంపూర్ణేష్ బాబు
న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో నాని బెస్ట్ ఫ్రెండ్‌గా ‘బిర్యానీ’ అనే కీలక పాత్రలో నటిస్తున్న సంపూర్ణేష్ బాబు.. తన పాత్ర, నానితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం, సినిమా విశేషాలను విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.
‘ది ప్యారడైజ్’లో బిర్యానీ క్యారెక్టర్‌తో సర్ప్రైజ్ చేయబోతున్నారు కదా?
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల గారి దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది. వెళ్లి ఆయనను కలిశాను. అప్పుడు సినిమాలోని ‘బిర్యానీ’ క్యారెక్టర్ గురించి చెప్పారు. నాకు ఆ పాత్ర చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ క్యారెక్టర్ చాలా సీరియస్‌గా ఉంటుంది.
ఇందులో నేను నాని గారి బెస్ట్ ఫ్రెండ్‌గా కనిపిస్తాను. సినిమా అంతటా నా క్యారెక్టర్ ఉంటుంది. ప్రేక్షకులకు ఈ పాత్ర కచ్చితంగా కొత్త అనుభూతిని ఇస్తుంది.
కామెడీ పాత్రలకు ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న మీరు ఇలాంటి సీరియస్ రోల్ చేయడం ఎలా అనిపించింది?
ఇలాంటి క్యారెక్టర్ నాకు మూడు సంవత్సరాల క్రితమే వచ్చి ఉంటే, నా కెరీర్లో జరిగిన కొన్ని తప్పులు జరిగేవి కావేమో అనిపిస్తుంది. నాని అన్నతో, శ్రీకాంత్ గారితో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ఇంత పెద్ద సినిమాలో నేను ఇంతవరకు నటించలేదు. నా మీద మేకర్స్ చాలా నమ్మకం పెట్టుకున్నారు. వాళ్లు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నా వంతు కృషి చేశాను.
నాని గారితో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
నాని గారు నాకు చాలా కంఫర్ట్ ఇచ్చారు. ఇంత పెద్ద సినిమాలో ఇన్ని రోజులు పనిచేయడం నాకు ఇదే మొదటిసారి. షూటింగ్ సెట్స్‌లో ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.
నాని గారి డెడికేషన్ అద్భుతంగా ఉంటుంది. నేను ఏదైనా సీన్ చక్కగా పర్ఫార్మ్ చేస్తే ఆయన మెచ్చుకునేవారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా మంచి అనుభవం.
ఈ ఆఫర్ రావడం వెనుక సాయి రాజేష్ గారు ఉన్నారని విన్నాం.
అవునండి. సాయి రాజేష్ గారు నాకు ఫోన్ చేసి, శ్రీకాంత్ గారి ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వస్తుంది, చక్కగా మాట్లాడి ఈ క్యారెక్టర్ చేయమని చెప్పారు. సాయి రాజేష్ గారు, శ్రీకాంత్ గారు చాలా మంచి స్నేహితులు.
మీరు గతంలో మోహన్ బాబు గారి బ్యానర్లో సినిమా చేశారు. ఇప్పుడు ఆయనతో కలిసి నటిస్తున్నారు. ఎలా అనిపించింది?
చాలా హ్యాపీగా అనిపించింది. మోహన్ బాబు గారితో కలిసి నటించాలని నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాలో మా కాంబినేషన్లో సీన్స్ ఉన్నాయని చెప్పగానే చాలా ఆనందంగా అనిపించింది. ఎప్పటినుంచో ఉన్న ఒక కల నెరవేరినట్టుగా అనిపించింది.
ఈ క్యారెక్టర్ కోసం ఫిజికల్‌గా ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు?
ఈ పాత్ర కోసం బరువు తగ్గాలని చెప్పారు. దాంతో బరువు తగ్గాను. అలాగే జుట్టు, గడ్డం కూడా పెంచాను. డైరెక్టర్ గారు ఏం చెబితే అది ఫాలో అయ్యాను. పాత్రకు అవసరమైన విధంగా పూర్తిగా మారేందుకు ప్రయత్నించాను.
అంతేకాదు, ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకూడదని కూడా నిర్ణయించుకున్నాను. కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ, ‘ది ప్యారడైజ్’ షూటింగ్ పూర్తయ్యే వరకు ఏ సినిమా చేయనని చెప్పాను. ఈ సినిమాకు అంత ప్రాధాన్యత ఇచ్చాను.

అసలు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
ప్యారడైజ్ బిర్యానీ ఎంత అద్భుతంగా ఉంటుందో.. సినిమా కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. అంతకంటే అద్భుతంగా నా క్యారెక్టర్ ఉంటుంది. (నవ్వుతూ) అది ఎలా ఉంటుందో సెప్టెంబర్ 24న థియేటర్లలో చూసి తెలుసుకోండి.
శ్రీకాంత్ గారు ప్రతి క్యారెక్టర్‌ను చాలా క్లారిటీతో డిజైన్ చేశారు. సినిమాలో ప్రతి సీన్‌కు, ప్రతి క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎమోషన్స్, యాక్షన్ అద్భుతంగా ఉంటాయి.
ఇప్పటికే ‘ఆయా షేర్’, ‘యేషా నాగుల కట్ట’ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఎక్కడ చూసినా ఈ పాటలే వినిపిస్తున్నాయి. సినిమాపై ఆడియన్స్‌లో ఉన్న ఆసక్తికి ఇది నిదర్శనం.
నిర్మాత సుధాకర్ చెరుకూరి గురించి చెప్పండి.
ప్రొడ్యూసర్ సుధాకర్ గారు మమ్మల్ని చాలా కంఫర్ట్‌గా చూసుకున్నారు. సినిమాను చాలా గ్రాండ్‌గా నిర్మించారు. ‘ది ప్యారడైజ్’లో వరల్డ్ బిల్డింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమా కోసం భారీ స్థాయిలో వర్క్ చేశారు.
రెమ్యూనరేషన్ పరంగా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నింటిలోకెల్లా ‘ది ప్యారడైజ్’కే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్నాను.
మీ కొత్త సినిమాల గురించి?
నాకు ఎప్పుడూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది. కొత్తగా, ఆసక్తికరంగా ఉండే పాత్రలు చేయడానికి ఎదురుచూస్తున్నాను. త్వరలోనే ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన ఉంటుంది.
