Kiran Abbavaram
కిరణ్ అబ్బవరం #KA13కి ‘రియాలిటీ’ టైటిల్.. క్రిస్మస్కు థియేటర్లలో సందడి
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం #KA13. క మరియు కె-రాంప్ చిత్రాల విజయాల తర్వాత కిరణ్ అబ్బవరం మరింత వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు తాజాగా ‘రియాలిటీ’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేయగా, సినిమాపై ఆసక్తిని పెంచేలా ఇది ఆకట్టుకుంది.
జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ యెర్రా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కిరణ్ అబ్బవరం కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు ఆయన కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలతో పాటు హీరోగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, మచిలీపట్నంలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన క్విర్కీ ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్, ఆసక్తికరమైన బిహైండ్ ది సీన్స్ వీడియో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాయి. తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమా కథా ప్రపంచం, పాత్రల స్వభావం, భావోద్వేగాలను పరిచయం చేసింది.
ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం ఆనందం అనే బాధ్యతగల యువకుడిగా కనిపించనున్నారు. ఆనందం ఎంతో అంకితభావంతో ఆనందం హోటల్ నడుపుతుంటాడు. ఇతరులకు ఆహారం అందించడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ, జీవితంలోని చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించే వ్యక్తిగా అతని పాత్రను తీర్చిదిద్దారు.
తనకు నిజమైన ‘హై’ ఎప్పుడు వస్తుందనే ప్రశ్నకు.. తన కుటుంబ అప్పులన్నీ తీర్చేసినప్పుడు అని ఆనందం చెప్పే సన్నివేశం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. మధ్యతరగతి కుటుంబాల జీవితాలకు ఎంతో దగ్గరగా ఉండే ఈ భావన సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. సాధారణ మనుషుల జీవితాల్లోని నిజమైన భావోద్వేగాలను ప్రతిబింబించే కథ కావడంతోనే ‘రియాలిటీ’ అనే టైటిల్ సినిమాకు సరిగ్గా సరిపోయేలా ఉంది.
కిరణ్ అబ్బవరం కథా రచనలోనూ తన ప్రత్యేకతను చూపించినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. సాధారణ జీవితంలోని సంఘటనలను ఆసక్తికరంగా మలుస్తూ, కుటుంబ బంధాలు, స్నేహం, ఆనందం వంటి అంశాలను సహజంగా చూపించారు. స్నేహితులతో తన సంతోషాన్ని పంచుకునే ఆనందం.. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి టెర్రస్‌పై అప్పడాలు చేసుకుంటూ గడిపే సన్నివేశాలు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి.
నటుడిగా కిరణ్ అబ్బవరం ఆనందం పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే బాధ్యతగల యువకుడిగా ఆయన పాత్ర ప్రేక్షకులకు సులభంగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది.
ఈ చిత్రంలో దేవిక భట్ కథానాయికగా నటిస్తుండగా, శరత్ కుమార్, సాయికుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ, సుధర్శన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సాంకేతికంగా విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. గ్లింప్స్‌లో వినిపించిన భజ గోవిందం ట్రాక్ సినిమాకు మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చింది. సుధీర్ మాచర్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా, సంతోష్ నాయుడు ఎడిటర్‌గా, రాజేష్ కమార్సు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
టైటిల్ గ్లింప్స్ ఒక ఫుల్ మీల్ ఫీస్ట్‌లా అనిపిస్తూ.. ‘రియాలిటీ’ సినిమా ఏ తరహా భావోద్వేగాలతో రూపొందుతోందో స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథ, సహజమైన పాత్రలు, కిరణ్ అబ్బవరం చేపట్టిన పలు కీలక బాధ్యతలతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
‘రియాలిటీ’ చిత్రం 2026 డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
