Shiva Nirvana
“ఇరుముడి”లో కొత్త రవితేజను చూస్తారు: శివ నిర్వాణ
ఫ్యామిలీ ఎమోషన్, క్రైమ్ యాంగిల్‌తో ‘ఇరుముడి’ కొత్త అనుభూతినిస్తుంది
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. గ్లింప్స్, ట్రైలర్, పాటలకు ఇప్పటికే మంచి స్పందన లభించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయ్యప్ప స్వామి మాల నేపథ్యంతో ఫ్యామిలీ ఎమోషన్, క్రైమ్ అంశాలను మిళితం చేస్తూ తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 21న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ మీడియాతో మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు.
రామ్ చరణ్ సినిమాలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. నిజమేనా?
అది కేవలం సోషల్ మీడియా ప్రచారం మాత్రమే. రామ్ చరణ్ గారు అయ్యప్ప స్వామి భక్తులు. ఆయనకు ఆ వైబ్ ఉండటంతో అభిమానులు బహుశా అలా ఊహించి ఉంటారు. కానీ సినిమాలో చరణ్ గారు కనిపించరు. ఈ సినిమా ఆయనకు నచ్చాలని కోరుకుంటున్నాను.
భారీ అంచనాలను ‘ఇరుముడి’ అందుకుంటుందా?
ఈ సినిమాలో మూడు ప్రధాన లేయర్స్ ఉన్నాయి. ఒకటి అయ్యప్ప స్వామి మాల నేపథ్యం, రెండోది ఫ్యామిలీ ఎమోషన్, మూడోది క్రైమ్ యాంగిల్. ప్రమోషన్లను కూడా ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేశాం.
ట్రైలర్ వచ్చేసరికి సినిమా ఏ తరహాలో ఉండబోతుందనే విషయంలో ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చింది. అందరూ సినిమాను చూడటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేక్షకుల అంచనాలను ‘ఇరుముడి’ ఖచ్చితంగా అందుకుంటుంది.
రవితేజను చాలా కొత్తగా చూపించారు. ఈ పాత్ర కోసం ఎలాంటి ప్రిపరేషన్ చేశారు?
ఎవరూ టచ్ చేయని పాయింట్‌ను ఒక నటుడు చేస్తే ఒక స్థాయి రీచ్ ఉంటుంది. అదే కథను ఒక స్టార్ హీరో చేస్తే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. అయ్యప్ప స్వామి మాల నేపథ్యంతో ఫ్యామిలీ, క్రైమ్ అంశాలను కలిపిన ఈ కథ రవితేజ గారి లాంటి స్టార్ హీరో ద్వారా ప్రతి ఇంటికి చేరుతుందని భావించాను.
రవితేజ గారి గడ్డం, తేజస్సు, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాత్రకు అద్భుతంగా సరిపోయాయి.
‘మాలికాపురం’తో పోలికలు వచ్చాయి కదా?
అయ్యప్ప స్వామి బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. అందుకే ఇలాంటి నేపథ్యంతో సినిమా వచ్చినప్పుడు గతంలో వచ్చిన చిత్రాలతో పోలికలు సహజమే. ‘మాలికాపురం’తో కూడా పోలిక వచ్చింది.
అయితే నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే నా సినిమా కంటెంట్ ఏమిటో నాకు తెలుసు. ట్రైలర్ విడుదలైన తర్వాత ‘ఇరుముడి’లోని ప్రత్యేకత ఏమిటో ప్రేక్షకులకు కూడా అర్థమైంది. ఈ బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటివరకు రాని విధంగా సినిమా ఉంటుంది.
అయ్యప్ప మాల నేపథ్యంలో కథ కోసం ఎలాంటి హోంవర్క్ చేశారు?
కథ అనుకున్న తర్వాత అయ్యప్ప స్వామి మాల గురించి చాలామందిని అడిగి తెలుసుకున్నాను. అయినా ఇంకా ఏదో తెలుసుకోవాల్సి ఉందనే భావన ఉండేది. అందుకే నేనే మాల ధరించాను. ఫిలింనగర్లో జరిగిన పడిపూజలకు వెళ్లాను. గురుస్వాములను కలిశాను. అంతకుముందు దర్శకుడు హను రాఘవపూడి గారితో కలిసి శబరిమలకు కూడా వెళ్లాను.
మంగళహారతులు, భజనలు, రుద్రాక్షలు ధరించే విధానం వంటి అంశాలను సినిమాలో చాలా ప్రామాణికంగా చూపించాం.
ఈ కథ రాసేటప్పుడు రవితేజను దృష్టిలో పెట్టుకున్నారా?
లేదు. మొదట కథ అనుకున్నప్పుడు ఎవరినీ దృష్టిలో పెట్టుకోలేదు. కానీ రవితేజ గారికి కథ చెప్పిన తర్వాత ఈ పాత్రకు ఆయన పర్ఫెక్ట్గా సరిపోతారని అనిపించింది.
ఆయన చాలా కూల్‌గా ఉంటారు. కథ ఓకే చేసిన తర్వాత దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. ఎలాంటి ఒత్తిడి పెట్టరు.
‘మల్లెపూల పల్లకి’ పాటకు మంచి స్పందన వస్తోంది. దాని గురించి?
‘మల్లెపూల పల్లకి’ పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే 9 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.
సీలేరు ప్రాంతంలో అయ్యప్ప భక్తులు ఎక్కువగా పాడుకునే పాట ఏదని ఒక స్వామిని అడిగినప్పుడు ఆయన ‘మల్లెపూల పల్లకి’ గురించి చెప్పారు. ఆ పాటతో షూటింగ్ చేశాం. తర్వాత చాలా మంది ఈ పాటను కోరారు. మేము అనుకున్నది, అభిమానులు కోరుకున్నది ఒకటే కావడం చాలా ఆనందంగా అనిపించింది.
ఈ పాటను దాదాపు 15 ఏళ్లుగా అయ్యప్ప భక్తులు పడిపూజల్లో పాడుతున్నారు. అందుకే ఒరిజినల్‌గా పాడిన డప్పు శ్రీను గారితోనే మళ్లీ పాడించాం. ఆయన గొంతుకు ఉన్న ప్రత్యేకత ఈ పాటకు మరింత ప్రామాణికతను తీసుకొచ్చింది.
సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ గురించి?
విష్ణు శర్మ అద్భుతమైన కెమెరామెన్. రవితేజ గారు, నేను ఇద్దరం చాలా వేగంగా పనిచేస్తాం. ఆ వేగానికి తగ్గట్టుగా విష్ణు శర్మ కూడా అద్భుతంగా పనిచేశారు.
సీలేరులో చిత్రీకరించిన విజువల్స్ ప్రేక్షకులను నేరుగా కథలోకి తీసుకెళ్తాయి.
బేబీ నక్షత్రను ఎలా ఎంపిక చేశారు?
‘మనెమ్మ’ పాత్రకు చాలా నేటివిటీ అవసరం. మన ఇంట్లోని పాపలా సహజంగా కనిపించాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె రీల్స్ చూసి నచ్చింది. లుక్ టెస్ట్ చేసి, కొన్ని వీడియోలు షూట్ చేశాం. ఆ తర్వాత ‘మనెమ్మ’ పాత్రకు నక్షత్ర పర్ఫెక్ట్గా సరిపోతుందని అనిపించింది.
మీ గత సినిమాలతో పోలిస్తే ‘ఇరుముడి’ చాలా భిన్నంగా కనిపిస్తోంది. ఈ కథ ఎంచుకోవడానికి కారణం?
ప్రతి కథను తీవ్రతతో చెప్పాలనేది నా ఉద్దేశం. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సినిమాలు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేశాం. భవిష్యత్తులో నేను సినిమాలు చేయడం ఆపేసినా నా కథలు గుర్తుండిపోవాలని కోరుకుంటాను.
అలాంటి ఇంటెన్సిటీ ‘ఇరుముడి’లో కూడా ఉంది. అయ్యప్ప స్వామి మాల నేపథ్యంలో అద్భుతమైన హ్యూమన్ డ్రామా ఉంది. మాల ధరించిన తర్వాత భక్తులు ఎంత నిష్టగా ఉంటారో, తప్పు చేయకుండా ఎలా నియమాలను పాటిస్తారో ఈ సినిమాలో చూపించాం.
రవితేజ గారి పాత్రలో ఈ హ్యూమన్ డ్రామా చాలా బలంగా ఉంటుంది. మాల ధరించినప్పుడు ఆయన ఎలా ఉంటారు, మాల లేనప్పుడు ఎలా ఉంటారు అనే అంశాల చుట్టూ స్క్రీన్‌ప్లే సాగుతుంది.
‘ఇరుముడి’ అయ్యప్ప స్వామి మాల బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథే కానీ, ఇది అయ్యప్ప స్వామి కథ కాదు. ఇది బలమైన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాతో పాటు క్రైమ్ యాంగిల్ ఉన్న కథ.
సాయికుమార్ గారి పాత్ర ఎలా ఉంటుంది?
సాయికుమార్ గారు గురుస్వామి పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన ఆహార్యం, వ్యక్తిత్వం ఆ పాత్రకు చాలా బాగా సరిపోయాయి.
మాంటేజ్ సాంగ్స్ మీరే డైరెక్ట్ చేశారని విన్నాం?
అవును. ఇది నా మొదటి సినిమా నుంచి నాకు ఉన్న అలవాటు. షూటింగ్ సమయంలోనే కొన్ని మాంటేజ్ షాట్స్ తీసుకుంటాను. వాటిని తర్వాత ఎడిటింగ్‌లో ఉపయోగిస్తాను.
దీంతో ఒక ప్రాంతం, ఒక ఊరు మొత్తం కథలో భాగమైన అనుభూతి కలుగుతుంది. ‘నిన్ను కోరి’ సినిమా నుంచి ఈ పద్ధతిని అనుసరిస్తున్నాను.
మైత్రి మూవీ మేకర్స్ సహకారం ఎలా ఉంది?
నవీన్ గారు, రవి గారు దర్శకుడికి చాలా స్వేచ్ఛ ఇస్తారు. నేను త్వరగా షూట్ చేస్తాను, బడ్జెట్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని పనిచేస్తాననే నమ్మకం వారికి ఉంది.
సీలేరులో దాదాపు 250 మందితో షూటింగ్ చేశాం. అది సాధారణ విషయం కాదు. మైత్రి మూవీ మేకర్స్ నుంచి మాకు అద్భుతమైన సహకారం లభించింది.
‘ఇరుముడి’ టైటిల్ ముందే అనుకున్నారా?
అవును. ఇందులో తండ్రి, కూతురికి ఒక ముడి ఉంటుంది. అలాగే అయ్యప్ప భక్తుడికి, మాలకు మరో ముడి ఉంటుంది. మరోవైపు క్రైమ్ ఎలిమెంట్‌కు సంబంధించిన ముడి ఉంటుంది. ఈ మూడు ముడులను కలిపేలా ‘ఇరుముడి’ అనే టైటిల్ పెట్టాను.
లొకేషన్స్ గురించి చెప్పండి?
సినిమాను ఎక్కువగా రూరల్ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. సాధారణంగా కేరళ పల్లెల్లో షూట్ చేసి ఆంధ్రా ప్రాంతాలకు మ్యాచ్ చేస్తుంటారు. కానీ ‘ఇరుముడి’ కోసం మేము మారేడుమిల్లి దాటి మరో రెండు గంటలు ప్రయాణించి సీలేరు ప్రాంతానికి వెళ్లాం.
ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో ఉన్న సీలేరు చుట్టూ ఎటు చూసినా కొండలు, అడవులు, పచ్చదనం కనిపిస్తాయి. ఈ సినిమా విజువల్స్‌కు ఆ ప్రాంతం ఎంతో బాగా ఉపయోగపడింది.
సీలేరు బాలాజీ గారు, కొల్లూరు రమణమూర్తి గారు, అక్కడి ప్రజలు మాకు ఎంతో సహకరించారు. వారందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఇరుముడి’తో రవితేజను సరికొత్త కోణంలో చూపించడంతో పాటు, ఫ్యామిలీ ఎమోషన్, క్రైమ్ అంశాలను అయ్యప్ప మాల నేపథ్యంతో మిళితం చేసి ఒక విభిన్నమైన అనుభూతిని అందించాలన్నది దర్శకుడు శివ నిర్వాణ ప్రయత్నంగా కనిపిస్తోంది.

